Breaking News

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక పురోగమనం… అంతర్జాతీయ సంబంధాలలో మెరుగుదలను ప్రశంసించిన చైనా పత్రిక “గ్లోబల్ టైమ్స్”

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వృద్ధి, సామాజిక పాలన, విదేశాంగ విధానం పరంగా గణనీయమైన ప్రగతి సాధిస్తున్నదని ప్రశంసిస్తూ, బీజింగ్‌ నుంచి వెలువడే ప్రముఖ చైనా పత్రిక “గ్లోబల్ టైమ్స్” అరుదైన రీతిలో ఒక వ్యాసం ప్రచురించింది.
షాంఘైలోని ఫుడాన్ విశ్వవిద్యాలయంలో ‘దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం’ డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ ఈ కథనం రాశారు. భారతదేశం గత నాలుగేళ్లలో అద్భుత విజయాలు సాధించిందని ఈ వ్యాసంలో ఆయన ప్రశంసించారు. ఈ మేరకు భారత్ సాధించిన బలమైన ఆర్థిక వృద్ధిని, పట్టణ పాలనలో మెరుగుదలను, అంతర్జాతీయ సంబంధాలలో… ముఖ్యంగా చైనాతో భారత్ వైఖరిలో మార్పును ఈ కథనం స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు… చైనా-భారత్ మధ్య వాణిజ్య అసమతౌల్యం గురించి ప్రస్తావిస్తూ- “దీన్ని తగ్గించడంలో భాగంగా భారత ప్రతినిధులు లోగడ చైనా చేపట్టే చర్యలపై ప్రధానంగా దృష్టి సాధించేవారు. అయితే, నేడు వారు భారత ఎగుమతి సామర్థ్యం పెంపుపై అధికంగా దృష్టి పెడుతున్నారు” అని వ్యాసకర్త పేర్కొనడం గమనార్హం.
అలాగే స్వీయ వ్యూహాత్మక విశ్వాసాన్ని ప్రస్ఫుటం చేసే “భారత్ విజయాలను” ప్రోత్సహించడంలో దేశం అనుసరిస్తున్న ముందుచూపుగల విధానాలను ఈ వ్యాసం ప్రత్యేకంగా ప్రశంసించింది. అంతేకాకుండా తన సత్వర ఆర్థిక-సామాజిక ప్రగతితో “భారత విజయాల”ను మరింత వ్యూహాత్మకంగా, నమ్మకంగా మార్చడంలో ఎంతో క్రియాశీలత ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. ఇక “రాజకీయ, సాంస్కృతిక రంగాల విషయానికొస్తే… పశ్చిమ దేశాలతో తన ప్రజాస్వామ్య ఏకాభిప్రాయాన్ని నొక్కి చెప్పడం నుంచి ప్రజాస్వామ్య రాజకీయాల్లో ‘భారతీయ విశిష్టతను’ నొక్కి చెప్పగల స్థాయికి ఎదిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం, ప్రజాస్వామ్య రాజకీయాల్లో భారత మూలాలకు మరింత ప్రాధాన్యం ఉంది” అని ఆయన వివరించారు.
ఇదంతా గమనిస్తే.. చారిత్రక వలసపాలన ముద్రను వదిలించుకుని రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రపంచాన్ని ప్రభావితం చేయగల స్థాయికి ఎదగడంపై భారతదేశానికిగల బలమైన ఆకాంక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తోందని వ్యాసకర్త పేర్కొన్నారు.
అంతేకాకుండా ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారత విదేశాంగ విధాన వ్యూహాన్ని వ్యాసం కొనియాడింది. ఈ మేరకు దేశం అనుసరిస్తున్న బహుళ సమన్వయ విధానం సహా…రష్యా-ఉక్రెయిన్ వివాదంలో ఒకవైపు నిశిత వైఖరి ప్రదర్శిస్తూ, మరోవైపు అగ్రదేశాలైన అమెరికా, జపాన్, రష్యాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడాన్ని వ్యాస రచయిత ప్రస్తుతించారు.
అలాగే భారత విదేశాంగ విధానంలో వ్యూహాత్మక దృక్పథంలో మరొక మార్పును కూడా రచయిత ప్రస్తావించారు. ఈ వ్యూహం ఇప్పుడు అగ్రశక్తిగా ఎదిగే వైపు స్పష్టమైన అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. “ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా, జపాన్, రష్యా సహా ఇతర దేశాలు, ప్రాంతీయ సంస్థలతో భారత సంబంధాలకు తోడ్పడే బహుళ-సమన్వయ వ్యూహం దిశగా గళం వినిపించారు” అని ప్రొఫెసర్ జాంగ్ తెలిపారు.
భారత్ తననుతాను సదా ప్రపంచ శక్తిగా పరిగణించుకుంటున్నదని ఈ వ్యాసం పేర్కొంది. అయితే… పదేళ్ల కన్నా తక్కువ సమయంలోనే బహుళ-సమతౌల్య నుంచి బహుళ-సమన్వయ విధానం వైపు మారిన భారతదేశం… నేటి బహుళ ధ్రువ ప్రపంచంలో ఒక ధ్రువంగా మారే వ్యూహం వైపు వేగంగా పయనిస్తోంది. చివరగా- “పరివర్తనాత్మక, బలమైన, సుదృఢ భారతం నేడు ప్రపంచ దేశాలు పరిగణనలోకి తీసుకోవలసిన నవ్య భౌగోళిక-రాజకీయ శక్తిగా మారింది” అని రచయిత స్పష్టం చేశారు.
ఈ విధంగా భారత పురోగమనం, ప్రధానమంత్రి మోదీ వ్యూహాత్మక దృక్పథంపై గ్లోబల్ టైమ్స్ అరుదైన రీతిలో ప్రశంసలు గుప్పించింది. ప్రపంచంపై ఇనుమడిస్తున్న భారత ప్రభావాన్ని, అంతర్జాతీయ యవనికపై పాత్ర పోషణలో అది వేస్తున్న బలమైన ముద్రను ఈ వ్యాసం స్పష్టంగా సూచిస్తోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *