తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

-ముందస్తు జాగ్రత్తలు పాటించాలి.. అత్యవసర సహాయం కోసం 112, 1070 నంబర్లను సంప్రదించాలి: విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాబోయే తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. తుపాను ప్రభావానికి గురయ్యే ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని తెలిపారు.

అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు

తుపాను లేదా ఇతర విపత్తుల సమయంలో అత్యవసర సహాయం కోసం రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (SEOC) నంబర్లను సంప్రదించాలని సూచించారు.

112
1070
1800 425 0101

తుపానుకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పుకార్లను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలి. అధికారిక హెచ్చరికలు, సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి.
మొబైల్ ఫోన్లను పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలి. విపత్తుల నిర్వహణ సంస్థ పంపే హెచ్చరిక సందేశాలను గమనించాలి.
రేడియో, టెలివిజన్, వార్తాపత్రికల ద్వారా వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవాలి.
విలువైన పత్రాలు, ధ్రువపత్రాలను వాటర్‌ప్రూఫ్ కవర్లలో భద్రపరచుకోవాలి.
అత్యవసర వస్తువులతో కూడిన కిట్‌ను సిద్ధం చేసుకోవాలి.
ఇంటి పైకప్పు, తలుపులు, కిటికీలను బలంగా ఉండేలా చూసుకోవాలి.
కనీసం ఒక వారానికి సరిపడా ఆహారం, తాగునీరు, అవసరమైన మందులు నిల్వ ఉంచుకోవాలి.
వరదలు, సముద్రపు ఉప్పెన ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి.

తుపాను సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు

అవసరమైతే విద్యుత్ మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేసి, గ్యాస్ సరఫరాను సురక్షితంగా నిలిపివేయాలి.
తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి.
ఇల్లు సురక్షితం కాదని భావిస్తే ముందుగానే సమీపంలోని అధికారిక ఆశ్రయ కేంద్రానికి వెళ్లాలి.
కాచి చల్లార్చిన లేదా సురక్షితంగా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి.
భవనం దెబ్బతినే ప్రమాదం ఎదురైతే అందుబాటులో ఉన్న బలమైన ఆశ్రయం పొందుతూ అధికారుల సూచనలు పాటించాలి.

తుపాను సమయంలో బయట ఉన్నప్పుడు

దెబ్బతిన్న, పాత భవనాలకు దూరంగా ఉండాలి.
చెట్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల సమీపంలో నిలబడకూడదు.
వరద నీటిలో నడవడం లేదా వాహనాలతో వెళ్లడం చేయకూడదు.
గాలి తీవ్రత తగ్గినప్పటికీ తుపాను పూర్తిగా ముగిసిందని భావించకూడదు. అధికారులు అధికారికంగా ప్రమాదం తొలగిందని ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలి.

తుపాను అనంతరం పాటించాల్సిన జాగ్రత్తలు

సురక్షితమైన, శుద్ధి చేసిన తాగునీటిని మాత్రమే వినియోగించాలి.
అధికారుల అనుమతి వచ్చే వరకు సహాయక శిబిరాలను విడిచి వెళ్లకూడదు.
తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
నీటిలో తడిసిన లేదా దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను నిపుణుల తనిఖీ అనంతరమే ఉపయోగించాలి.
దెబ్బతిన్న రహదారులు, వరద నీరు ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించకుండా జాగ్రత్త వహించాలి.

మత్స్యకారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

తుపాను హెచ్చరికలు అమల్లో ఉన్నప్పుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదు.
మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసి ఉంచుకోవాలి.
అదనపు బ్యాటరీలతో కూడిన రేడియోను సిద్ధంగా ఉంచుకోవాలి.
పడవలు, తెప్పలను సురక్షిత ప్రాంతాల్లో బలంగా కట్టి ఉంచుకోవాలి.
సముద్రంలో వాతావరణ పరిస్థితులపై అధికారుల సూచనలను నిరంతరం గమనించాలి.

ప్రజల భద్రతే ప్రధానమని పేర్కొన్న విపత్తుల నిర్వహణ సంస్థ, తుపాను హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగానికి సహకరిస్తూ సూచించిన భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది.

— ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ