‘అర్నబ్’ తుపాను నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి

-ప్రజల ప్రాణ రక్షణకే తొలి ప్రాధాన్యం
-తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
-తాగు నీరు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
-మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు.. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలి
-తుపాను హెచ్చరికలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను నేపథ్యంలో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల గ్రామాలు, మత్స్యకార ఆవాసాల ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీరాజ్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 28వ తేదీ ఉదయం తుపాను బాపట్ల – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, కాకినాడ – యానాం పరిసరాల్లోనూ ప్రభావం అధికంగా ఉండవచ్చని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తీర ప్రాంత ప్రజల తరలింపులో నిర్లక్ష్యం వద్దు
తీర ప్రాంత గ్రామాలు… ముఖ్యంగా తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే గ్రామాలను గుర్తించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుఫాను ప్రభావం పూర్తిగా సడలేంత వరకు తన పరిధిలోని శాఖల సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పూరిళ్లు, బలహీనమైన ఇళ్లు, శిథిల భవనాల్లో నివసిస్తున్న వారిని ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల కోసం పునరావాస శిబిరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్దేశం చేశారు.
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణకు అవసరమైన జనరేటర్లు, ఇంధన నిల్వలు అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా ప్రజలకు తాగునీరు అందించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా పంచాయతీరాజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మురుగు కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలని, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా అవసరమైన యంత్రాలను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. తుపాను అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు.
పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి
తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండనున్న బాపట్ల నుంచి అనకాపల్లి మధ్య తీర ప్రాంత గ్రామాల్లోని పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు, విద్యుత్, జనరేటర్లు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశించారు. చిన్నారులకు పాలు, వృద్ధులకు అవసరమైన మందులు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
మత్స్యకారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ
తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని  పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న తీర ప్రాంతమంతటా మత్స్యకారులు అధికారిక అనుమతి వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు. బోట్లు, వలలు, ఇతర మత్స్యకార సామగ్రిని సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని కోరారు.
చెరువులు, కాలువ గట్లు, గ్రామీణ రహదారులపై నిఘా
భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కాలువలు, వాగుల వద్ద నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, చెరువు కట్టలు, కాలువ గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ రహదారులు, వంతెనలు, కల్వర్టుల వద్ద వరద నీరు ప్రవహించే పరిస్థితుల్లో రాకపోకలను నియంత్రించాలని పేర్కొన్నారు. రహదారులపై చెట్లు కూలినా, రాకపోకలకు అంతరాయం ఏర్పడినా వెంటనే తొలగించేందుకు అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆసుపత్రులు, తాగునీటి పథకాలు, పునరావాస కేంద్రాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు, స్తంభాల వద్దకు ప్రజలు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని పేర్కొన్నారు.
అటవీ ప్రాంతాల్లో చెట్లు కూలే ప్రమాదం ఉన్నందున అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రహదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైన చోట్ల ప్రజల రాకపోకలను నియంత్రించాలని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, సముద్ర తీరాలు, బీచ్‌లకు వెళ్లవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. సెల్ఫీలు, వీడియోల కోసం సముద్ర తీరాలకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ, జిల్లా యంత్రాంగం జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. అలాగే తులాను ప్రభావిత ప్రాంతాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ శాఖల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగానికి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.