Breaking News

రాష్ట్రంలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు

-టూరిజం అభివృద్ధి ద్వారా ప్రజలకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం
-2014-19 మధ్య తలపెట్టిన టూరిజం ప్రాజెక్టులు అన్నీ పూర్తి చెయ్యాలి
-నాడు టూరిజంలో CAGR వృద్ధి 20.6 శాతం ఉంటే…2019-24 మధ్య 3.3 శాతానికి పడిపోయింది.
-రుషికొండ ప్యాలెస్ కు పెట్టిన ఖర్చులో సగం కూడా 5 ఏళ్లలో పర్యాటక రంగంపై పెట్టలేదు
-టూరిజంపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2019- 24 మధ్య నాటి పాలకులు అనుసరించిన ప్రభుత్వ టెర్రరిజం, నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కరోనా కంటే కూడా నాటి ప్రభుత్వ అసమర్థత వల్లనే టూరిజం రంగానికి ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా తెలుగుదేశం హయంలో ఒప్పందం చేసుకున్న సంస్థలు గత 5 ఏళ్లలో వెనక్కి పోయాయని అన్నారు. టూరిజంలో ఆశించిన స్థాయిలో కొత్తగా పెట్టుబడులు రాలేదని సీఎం అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్, అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…నాడు CAGR (కాంఫౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) 20.6 శాతం వృద్ధి ఉంటే….2019-24 మధ్య 3.3 శాతానికి పడిపోయిందని అన్నారు. నాటి తెలుగుదేశం హయాంలో టూరిజం శాఖపై రూ.880 కోట్లు ఖర్చు చేయగా…గత ప్రభుత్వం కేవలం రూ.213 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు. నాడు పెట్టుబడుల కోసం 190 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని రూ.1,939 కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. దీని ద్వారా 10,573మందికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 117 ఒప్పందాలు చేసుకుంటే కేవలం 3 ప్రాజెక్టులు మాత్రమే కార్యరూపం దాల్చాయన్నారు. నాడు టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం 105 ఈవెంట్స్ చేపడితే….గత ప్రభుత్వం కేవలం 44 ఈవెంట్స్ ను మాత్రమే నిర్వహించిందని అన్నారు. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం అభివృద్దికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని….నాడు ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టులను మళ్లీ పట్టాలు ఎక్కించడంతో పాటు…పెట్టుబడుదారులతో మాట్లాడి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. టెంపుల్ టూరిజంకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్న సీఎం….ఎకో టూరిజం అభివృద్ధికి అటవీ శాఖతో కలిసి పనిచేయాలని అన్నారు. శ్రీశైలంలో టెంపుల్, వాటర్, అటవీ టూరిజం డెవలప్ చేయాలని సూచించారు. మన సంస్కృతీ సాంప్రదాయాలు, ఆహార అలవాట్లను చాటేలా ఆయా టూరిజం సెంటర్లను అభివృద్ది చేయాలని అనారు. ప్రముఖ హోటల్స్ యాజమాన్యాలతో మాట్లాడి…హోటల్ నిర్మాణాలు పూర్తి చేసి వసతులు అందుబాటులోకి తేవాలన్నారు. టూరిజం సెంటర్ కు వచ్చిన పర్యాటకులు ఒకటి రెండు రోజులు అక్కడ ఉండే వాతారణం కల్పించాలని, అప్పుడు స్థానికులకు ఉపాధితోపాటు…ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని అన్నారు. కేంద్రం టూరిజం అభివృద్ధికి ఇచ్చే నిధులతో రూ.300 కోట్లతో శ్రీశైలం, రాజమండ్రి గోదావరి ప్రాంతం, సూర్యలంక బీచ్లలో టూరిజం ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని అన్నారు. అదే విధంగా దేశంలో టాప్ 5 రాష్ట్రాల్లో ఉన్న టూరిజం పాలసీలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా కొత్త టూరిజం పాలసీ తీసుకురావాలని అన్నారు. గండికోట, విశాఖ ఏజెన్సీ, గోదావరీ నదీ పరివాహక ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులకు అనుకూల అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సీ ప్లేన్ టూరిజం తెచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. మన హస్తకళలు, చేనేత, గిరిజన ఉత్పత్తులు, చేతివృత్తుల ఉత్పత్తులను టూరిస్టు సెంటర్లలో ప్రమోట్ చేయడం ద్వారా వారికి ఆదాయ మార్గం లభిస్తుందని అన్నారు. రుషికొండపై గత ప్రభుత్వం ముఖ్యమంత్రి నివాసం కోసం రూ.500 కోట్లతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలనే అంశంపైనా సమీక్షలో చర్చ జరిగింది. దీనిపై వివిధ వర్గాల ఆలోచనలు తీసుకుని నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు. రుషికొండ ప్యాలెస్ కోసం పెట్టిన ఖర్చులో సంగం కూడా గత ప్రభుత్వం పర్యాటక రంగంపై పెట్టకపోవడం విచారకరమని ముఖ్యమంత్రి అన్నారు. టూరిజం అభివృద్ధి అనేది సామాన్య ప్రజలకు ఉపాధి కల్పనలో అత్యంత కీలకమైనదని…అలాంటి రంగాన్ని కూడా నిర్వీర్యం చేశారని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో టూరిజం అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్థిష్టమైన ప్రణాళికతో రావాలని అధికారులకు సీఎం సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *