Breaking News

ఆహారం నామమాత్రపు ధరకే అన్న క్యాంటీన్లలో లభిస్తుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి పేదవానికి నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరకే అన్న క్యాంటీన్లలో లభిస్తుందని, మరింత మంది ఆకలి తీర్చడానికి దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఐఏఎస్ కోరారు. శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పల్నాడు బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, ఎంఎల్ఏ గల్లా మాధవిలతో కలిసి కలెక్టర్ పునః ప్రారంభించారు. అనంతరం కమిషనర్ తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ తో కలిసి నల్లచెరువు మెయిన్ రోడ్ లోని క్యాంటీన్ ను, ప్రత్తిపాడు ఎంఎల్ఏ బి.రామాంజనేయులు, తాడికొండ ఎంఎల్ఏ తెనాలి శ్రావణ్ కుమార్ లతో కలిసి ఆర్.టి.ఓ. ఆఫీస్, ఐడి హాస్పిటల్ వద్ద క్యాంటీన్లను పునః ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 ల నామ మాత్రపు ధరకే అందిస్తుందన్నారు. కేవలం రూ.15 తో 3 పూటలా కడుపు నింపుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారన్నారు. గుంటూరు జిల్లాలో జిఎంసి పరిధిలో 7, మంగళగిరి – తాడేపల్లి కార్పోరేషన్ పరిధిలో 3, తెనాలి మున్సిపాల్టీ పరిధిలో 3 క్యాంటీన్లను శుక్రవారం పునః ప్రారంభం చేస్తున్నామన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతి రోజు నిర్దేశిత మెనూ ప్రకారం ఆహార పదార్ధాలు అందిస్తుందన్నారు. పేదల ఆకలి తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్న క్యాంటీన్ల బృహత్తర కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.
కమిషనర్ గారు మాట్లాడుతూ పేదలకు 3 పూటలా కడుపు నింపే అన్న క్యాంటీన్లను ఇప్పటికే గుంటూరు నగరంలో ప్రధాన పల్నాడు బస్టాండ్, నల్లచెరువు, మిర్చి యార్డ్, చుట్టగుంట, ఆర్.టి.సి బస్టాండ్, ఐడి హాస్పిటల్, ఆట.టి.ఓ ఆఫీస్ వంటి 7 ప్రధాన ప్రాంతాల్లో పునః ప్రారంభం చేసుకోవడం జరుగుతుందన్నారు. త్వరలో మరిన్ని క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం టిఫిన్, భోజనం అధిక ధర ఉన్న సమయంలో పేదలకు రూ.5 కే టిఫిన్, రూ.5 కే భోజనం అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. క్యాంటీన్ ద్వారా పేదలకు ఆహారం అందించిడంలో తమ వంతు భాద్యతగా జీతంలో నుండి రూ.25వేలు అందిస్తామని, నగరంలోని దాతలు అన్న క్యాంటీన్ల ద్వారా మరింత మంది పేదలకు ఆహారం అందించడానికి తోడ్పాటు అందించాలని కోరారు.
ఎంఎల్ఏ గల్లా మాధవి గారు మాట్లాడుతూ రోజువారీ కూలి చేసుకునే ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ద్వారా వారికి కడుపు నిండా భోజనం అతి తక్కువ ధరకే అందుతుందన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అర్దాంతరంగా మూసివేసి, క్యాంటీన్లను అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మార్చారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదల ఆకలి తీర్చే క్యాంటీన్లకు మహర్దశ వచ్చిందన్నారు.
ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ గారు మాట్లాడుతూ పేదవాని ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అన్న క్యాంటీన్లలో ప్రతి శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 2 క్యాంటీన్లలో మధ్యాహ్నం భోజనం ఖర్చు తనే భరిస్తామని తెలిపారు. అలాగే నగరంలోని ఆటో నగర్, జిఎంసి దగ్గర, ప్రభుత్వ వైద్యశాల ప్రాంతాల్లో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు.
ఎంఎల్ఏ బి.రామాంజనేయులు గారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల పక్షపాతి ఎన్టీఆర్ స్పూర్తితో అన్న క్యాంటీన్లను పునరుద్దరణ చేయడం జరిగిందన్నారు. పేదల కోసం నిర్వహిస్తున్న క్యాంటీన్లకు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొల్లి జయరామిరెడ్డి రూ.10,116 చెక్ అందించారని, తను కూడా ఒక నెల వేతనం నుండి రూ.30 వేలను అన్న క్యాంటీన్ ట్రస్ట్ కి అందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సంవత్సరానికి ఒక్కసారి తమ నెల వేతనంలో 10 శాతం క్యాంటీన్ ట్రస్ట్ కి అందించడం ద్వారా మరింత మంది పేదల ఆకలి తీర్చే అవకాశం కల్గుతుందన్నారు.
ఎంఎల్ఏ టి.శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు తన పాలనలో పేదలకు రూ.2 కే కిలో బియ్యం అందించారని, ఆయన స్పూర్తితో చంద్రబాబునాయుడు గారు రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు తెచ్చారన్నారు. పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్లను గత ప్రభుత్వం దుర్మార్గపు రీతిలో నిలిపివేసిందని, ప్రస్తుత ఎన్డీఏ పాలనలో పేదలు ఆకలితో ఇబ్బంది పడకుండా క్యాంటీన్లు ఆకలి తీరుస్తాయన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. శ్యాం సుందర్, ఎంహెచ్ఓ మధుసూదన్, ఈఈలు సుందర్రామిరెడ్డి, కొండారెడ్డి, కోటేశ్వరరావు, శ్రీనివాస్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి  కలెక్టరు ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *