Breaking News

పంట నష్టం అంచనా వేయండి

-పంట నష్టం అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు వేగవంతం చేయండి
-డ్రెయిన్ కాలువలు క్లియర్ చేసి నీటి నిల్వలు మళ్లించండి 
-పశువులు మృత్యువాత పడకుండా అధికారులు, సిబ్బంది మందులతో అందుబాటులో ఉండాలి 
-వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల కాల్ సెంటర్లు కొనసాగించండి 
-పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది సెలవులు పెట్టకండి 
-రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు 

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడే పంట నష్టం అంచనా వేయాలని, పంట నష్టం అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు మార్లు వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు  అత్యవసర సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ డ్రెయిన్ కాలువలు క్లియర్ చేసి నీటి నిల్వలు మళ్లించాలని, వరద కారణంగా మృతి చెందిన పశు ససంపద నష్టం అంచనా వేయాలని పేర్కొన్నారు. వర్షాలకు ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో గేదెలు, ఆవులు – 14, కోళ్లు- 5000, గొర్రెలు ,మేకలు-4 మృతి చెందినట్లు అధికారులు మంత్రి అచ్చెన్నాయుడు గారికి తెలియచేశారు. పశువులు మృత్యువాత పడకుండా అవసరం మేరకు అధికారులు, సిబ్బంది మందులతో వరద ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఏలూరు, పల్నాడు జిల్లాలో కొంత మేర ఇన్ లాండ్ చెరువులకు, పడవలు, నెట్ లకు నష్టం వాటిల్లిందని మత్స్య అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,259 పడవలు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఒడ్డునే ఉన్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల కాల్ సెంటర్లు కొనసాగించాలని, ఆయా జిల్లాల కాల్ సెంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు, మత్స్యకారులను సూచనలు ఇవ్వాలని, నష్టం అదుపు చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది సెలవులు పెట్టకుండా రైతులకు అండగా నిలవాలని కోరారు. ముంపునకు గురయిన పంటల పునరుద్ధరణకు పంట సలహాలు మరియు తెగుళ్లు & వ్యాధుల సూచనాత్మక నియంత్రణ చర్యలు చేపట్టవలసినదిగా ఆదేశాలు జారీ చేశారు. రైతు సేవా కేంద్రం (గ్రామం), మండల, జిల్లా స్థాయి అధికారులు పంట క్షేత్రాలను పరిశీలించాలన్నారు. పొలాల్లోని అదనపు నీటిని బయటకు తీయడానికి మరియు పంట నష్టాన్ని తగ్గించడానికి దారులను సిద్ధం చేయాలని, ముంపు ప్రాంతాల్లో అత్యవసర సేవల్లో అవసరం మేరకు ఇతర శాఖలకు వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *