-మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ తో కలిసి బాధితులకి దుప్పట్ల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద కారణంగా ముంపు గురైన ప్రాంతాలను మాత్రమే కాదు…బాధితులందరూ సాధారణ స్థితికి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయక చర్యలు అందిస్తుంది. ముంపు బాధితులను అందరిని ఆదుకోవడమే ప్రభుత్వం లక్ష్యమని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో వరద బాధితులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం శనివారం 30 డివిజన్ దేవి నగర్ లోని రామకృష్ణపురంలో జరిగింది. ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు. మంత్రి ఫరూక్ తో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
అనంతరం మీడియాతో ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అన్ని ప్రభుత్వ శాఖలు,మంత్రివర్గం, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికార యంత్రాంగం, వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలందరి సమిష్టి కృషితో ముంపు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో ఆదుకునే చర్యలను పగడ్బందీగా నిర్వహించడం జరుగుతున్నదని పేర్కొన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ చర్యలను ముమ్మరం చేయడం జరిగిందన్నారు., నిత్యవసర సరుకుల కిట్ల పంపిణీ లో వరద బాధితులందరికి అందేలా ఒక ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. నగర ప్రజలు సాధారణ స్థితికి వచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం బాధితులందరికీ అండగా ఉంటుందన్నారు. అలాగే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక పందిరిలో విఘ్నేశ్వరుడ్ని దర్శించుకొని రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడాలని ఎంపి కేశినేని శివనాథ్ ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కుల రఘురామ రాజు, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మొహమ్మద్ ఫరూక్ షిబ్లీ , 30వ డివిజన్ బూత్ ఇన్ చార్జ్ లక్ష్మీ, టిడిపి మైనార్టీ నాయకులు పఠాన్, జిలానీ, ఎస్.కె.జిల్లు, బాజీ, రఫీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News