నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాసరావు నిడదవోలు మండలం కంసాలి పాలెం , సింగవరం గ్రామాలలో వరి పంటను పరిశీలించి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వటం జరిగినది. వరద ముంపు తీసిన వెంటనే ఎకరానికి 10 కేజీలు యూరియా మరియు 25 కేజీలు పొటాష్ వేసుకోవాలని సూచించారు.. అదేవిధంగా ఎకరాకు 400 గ్రాముల సాఫ్ పౌడర్ ను స్ప్రే చేసుకోవాలి. పొడతెగలు ఉంటే హెక్సాకోనాజోల్ లేదా వాలిడమైసిన్ ఎకరాకు 400 ఎమ్ ఎల్ ను స్ప్రే చేసుకోవాలని సూచించారు
భారీ వర్షాలకు వివిధ పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు
పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న అల్పపీడనం ప్రారంభంలోనే అల్పపీడనంగా మారడంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో ఆగస్టు 29 నుంచి భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగాయి. గత నాలుగు రోజులలో ఎక్కువగా యన్.టి.ఆర్ జిల్లాలో 335.2 మి.మీ, గుంటూరు జిల్లాలో 255.6 మి.మీ, కృష్ణా జిల్లాలో 246.7 మి.మీ, పల్నాడు జిల్లాలో 189.7 మి.మీ, బాపట్ల జిల్లాలో 177.3 మి.మీ. వర్షపాతం కురిసినది. దీని వలన బరువైన నల్లరేగడి నేలల్లో సాగు చేసే వరి, ప్రత్తి, కంది, మొక్కజొన్న, పెసర, మినుము మరియు తేలికపాటి ఎర్ర నేలల్లో సాగు చేసే వేరుశనగ పంటల్లో నీరు నిలవడం జరిగింది. అధిక తేమ శాతం వలన పూత, కాత రాలటం, పంట పెరుగుదల కుంటు పడడంతో పాటు దిగుబడులు తగ్గి, పంట నాణ్యత కూడ లోపిస్తుంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వివిధ పంటల్లో రైతాంగం ఆచరించవలసిన యాజమాన్య పద్దతులను కూలంకషంగా వివరించడమైనది.
వరిలో తీసుకోవలసిన జాగ్రత్తలు పరిశీలనలు :
వరి పంట ప్రస్తుతం నాట్లు వేసిన 20-40 రోజుల దశలో ఉన్నది.
ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలకు కృష్ణ, గుంటూరు, బాపట్ల మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో 1.1 లక్షల హెక్టార్లలో పంట ముంపుకు గురైంది.
ఈ జిల్లాలలో రైతులు ఎం.టి.యు 1318, ఎం.టి.యు 1061, ఎం.టి.యు 1062 మరియు బి.పి.టి 5204 రకాలను ఎక్కువగా సాగుచేశారు.
ఎం.టి.యు 1318 రకం సుమారు 5 6 రోజుల వరకు ముంపును తట్టుకుంటుంది.
ఎం.టి.యు 1061 రకం కూడా 6 7 రోజుల వరకు ముంపును తట్టుకుంటుంది.
బి.పి.టి 5204 మరియు ఇతర రకాలు 3 – 4 రోజుల వరకు ముంపును తట్టుకుంటాయి.
ముంపుకు కొద్ది రోజుల ముందు ఎరువులు వేసిన వరి పొలాలలో నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది.