Breaking News

నెలరోజుల్లో నిడదవోలులో మినీ స్టేడియం ప్రారంభం

-చదువు, క్రీడల్లో ఆకాశమే హద్దుగా విద్యార్థులు రాణించాలి
-మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం
-అంతర్జాతీయస్థాయిలో రాణించేలా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తాం
-ప్రతిభ గలిగిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు సిద్ధం
-క్రీడల్లో మారుమూల గ్రామస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం
-ప్రతి ఒక్కరూ బాల్యం నుండే క్రీడాస్ఫూర్తి పెంపొందించుకోవాలని సూచన
-నిడదవోలు నియోజకవర్గం స్థాయి అండర్-14,17 బాల బాలికల క్రీడా సెలక్షన్స్ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
మారుమూల ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి, అంతర్జాతీయస్థాయిలో రాణించేలా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని క్రీడాకారులనుద్దేశించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం నిడదవోలు పట్టణంలో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిడదవోలు నియోజకవర్గం స్థాయి అండర్-14,17 బాల బాలికల క్రీడా సెలక్షన్స్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి కాసేపు ఆటల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మంత్రి కందుల దుర్గేష్ ను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుతూనే క్రీడల్లో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు 1954లో ప్రారంభించిన క్రీడాకారుల సెలక్షన్స్ కార్యక్రమం నేటికీ కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తద్వారా మారుమూల గ్రామస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని, ఆకాశమే హద్దుగా క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని సూచించారు. దేశస్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే శక్తిసామర్థ్యాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయని, ప్రతిభకు మరింత పదునుపెట్టాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో ప్రతిభ కలిగిన క్రీడాకారుల సమాచారాన్ని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీడీల ద్వారా తెలియజేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రధానంగా పాల్గొనడం ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండే క్రీడాస్ఫూర్తి పెంపొందించుకోవాలని సూచించారు. తద్వారా భవిష్యత్ లో ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయిలో ఉండేందుకు ఉపకరిస్తుందని విద్యార్థులకు సూచించారు. నెలరోజుల్లో నిడదవోలులో మినీ స్టేడియం ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

కార్యక్రమంలో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గురునాథ్, విద్యా కమిటీ ఛైర్మన్ సూరభ్, మండల పీడీలు, ఉపాధ్యాయులు, పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిరంతర కృషి అభ్యాసం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధ్యం

-ఎమ్ ఈ వో లు నిరంతర పర్యవేక్షణా బాధ్యత వహించాలి -రానున్న వార్షిక 10 వ తరగతి లో ఉత్తీర్ణత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *