Breaking News

తిరుపతి జిల్లాలో మాలి బృందం పర్యటన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ద్వారా ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) పేరుతో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు మాలి దేశ ప్రతినిధి బృందం గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించింది. పెసొల్ ప్రాజెక్టు నేషనల్ కోఆర్డినేటర్ అండ్ టెక్నికల్ డైరెక్టర్ శ్రీ మహ్మద్ సౌమరే నేతృత్వంలోని 7 మంది సభ్యులతో కూడిన ఈ బృందం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు తిరుపతి రూరల్ మండలంలోని గ్రామాలలో పర్యటించింది. పెసొల్ ప్రాజెక్టు జీవ పర్యావరణ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించి నేలను పరిరక్షించే లక్ష్యంతో పనిచేస్తుంది. కే ఎఫ్ డబ్ల్యూ, జర్మన్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో పని చేస్తున్న రెండు వేర్వేరు సంస్థలు తమ దేశాలలో ఆగ్రో ఏకాలజీని ప్రోత్సహించే క్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా అనుసరిస్తున్నాయని తెలుసుకొనే లక్ష్యంతో ఈ పర్యటన చేస్తున్నారు.
ఈ బృందంలో ఆగ్రో ఏకాలజీ నిపుణులతో పాటు, మాలి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, రిసెర్చ్ ప్రొఫెసర్ లు, ఎన్జీవో అధికారులు, ఏహెచ్ టి గ్రూప్ కన్సల్టెంట్ లు ఉన్నారు. ఏహెచ్ టి గ్రూప్ రెండు సంస్థలకు కన్సల్టెంట్ సేవలు అందిస్తున్నాయి.
ఈ బృందం తొలుత తిరుపతి గ్రామీణ పరిధిలోని వేమూరు గ్రామంలోని డి. అయ్యప్ప నాయుడు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన జీవ ఎరువుల తయారీపై ఏర్పాటు చేసిన డెమో పద్ధతిలో పాల్గొని ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే వావిలాకు కషాయం,తూటికాడ కషాయం, ఉమ్మెత్త కషాయం, పేడ మూత్ర ఇంగువ ద్రావణాల తయారీ విధానమును ప్రత్యక్షంగా తెలుసుకొన్నారు. ఈ సంధర్భంగా తిరుపతి ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీ షణ్ముగంతిరుపతి జిల్లాలో పండిచే పంటల వివరాలను తెలియజేశారు.జిల్లాలో 70 శాతం వరి పంట సాగులో ఉందని, మిగతా 30 శాతం వేరుశనగ,మామిడి,కూరగాయల పంటలను పండిస్తారని వివరించారు.ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో 45000 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్దతులను పాటిస్తున్నారని స్పష్టం చేశారు.రైతులు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఎలా పొందుతారు అని మాలి ప్రతినిధుల బృందం ప్రశ్నించగా గ్రూపుల వారీగా సర్టిఫికేషన్ అందిస్తున్నట్లు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తునట్లు తెలిపారు.
అనంతరం అయ్యప్ప నాయుడు వ్యవసాయ క్షేత్రంలో ఎ.టి.యం ,ఎ గ్రేడ్ మోడల్ లను సందర్శించారు.ఈ సందర్బంగా మాలి ప్రతినిధులు రైతు అయ్యప్పనాయుడుతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు.ఎంత ఆదాయం వస్తుందని అరా తీశారు. అందుకు సమాధానంగా నాయుడు తనకున్న 5 ఎకరాల పొలంలో గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని,ప్రతి సంవత్సరం 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయల దాక ఆదాయం వస్తుందని మాలి ప్రతినిధులకు వివరిచారు.అయ్యప్పనాయుడు పొలాన్ని చూసిన మాలి ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభినందిచారు.
ఈ సందర్బంగా మాలి దేశ ప్రతినిధి బృంద సభ్యులు రమదాన్ సిల్లా మాట్లాడుతూప్రకృతి వ్యవసాయ సూత్రాలు మాకు బాగా నచ్చాయని, వాటిలో ముఖ్యంగా ఎట్టి పరిస్థితులలో రసాయనాలను వాడకూడదు అన్న సూత్రం మరింత ఆకట్టుకుందని తెలిపారు.మాదేశంలోని ఆగ్రో అకాడమిలో రసాయనాల గురించి శిక్షణలు ఇచ్చేవాడినని ఇకనుండి ప్రకృతి వ్యవసాయం పై కూడా శిక్షణలు ఇస్తానని అన్నారు. అవసరమైతే ఇక్కడి ఇండో జర్మని అకాడమితో ఒప్పందం కుదుర్చుకుంటామని అయన తెలిపారు.
అనంతరం రామచంద్రాపురం మండలంలోని చుట్టుగుంట గ్రామంలో శ్రీ రామాలయం నందు మహిళా సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా గ్రామంలోని 14౦ మంది రైతులలో 90 మంది రైతులు 92 .5 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని సంఘ ప్రతినిధులు వివరించారు. అనంతరం అదే గ్రామంలో ఝాన్సీ కి చెందిన కంద ,చామ గడ్డ పొలాలను సందర్శించారు .
అనంతరం సి. రామాపురం గ్రామంలో మహిళా సంఘాలు, గ్రామ ఐక్య సంఘాల ప్రతినిధులతో ముచ్చటించి మహిళా సంఘాల బాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం అమలు చేస్తున్న తీరును, మహిళల పాత్రను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం రామచంద్రాపురం మండలంలోని కుప్పం బహదూర్ గ్రామంలో పర్యటించి రైతు సాధికార సంస్థ ఆరోగ్య విభాగంలో భాగంగా లాలెమ్మ నిర్వహిస్తున్న సూర్యమండలం నమూనా ను పరిశీలించి అక్కడ హాజరైన లబ్దిదారులతో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వల్ల కలుగుతున్న ఆరోగ్యకర ప్రయోజనాలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రం సందర్శించి అంగన్వాడీ వర్కర్ లు మరియు పిల్లలతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా, వినియోగం తదితర అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ సురేంద్ర రెడ్డి,జిల్లా అడ్వైజర్ రవిచంద్ర ప్రసాద్ , అడిషనల్ ప్రాజెక్ట్ మేనేజర్ పట్టాభిరెడ్డి, ఎన్,ఎఫ్,ఎ లు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ,మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరం

-లక్షల ఖర్చుతో చేస్తున్ననగర సుందరీకరణకు పోస్టర్స్ తో చేటు -పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *