-వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష.. సామాజిక, పర్యావరణ భద్రతా చర్యల అమలుపై చర్చ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ప్రపంచ బ్యాంకు (World Bank), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB) సంయుక్త ప్రతినిధుల బృందం బుధవారం సమీక్షించింది. అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పనుల అమలు తీరు, సాధించిన పురోగతి, ఫలితాలు, అదనపు నిధుల విడుదల, భవిష్యత్ కార్యాచరణపై APCRDA, ADCL, AGICL అధికారులతో సమావేశాలు నిర్వహించింది.
రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో APCRDA కమిషనర్ వి. విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్లు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, టి. రాహుల్ కుమార్ రెడ్డి, అభిషేక్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు వర్చువల్ విధానంలో సమావేశాలకు హాజరయ్యారు.
సమీక్షలో భాగంగా రాజధాని ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సామాజిక భద్రత, పర్యావరణ పరిరక్షణ చర్యలు, కార్మిక శిబిరాల్లో కార్మికుల భద్రత, సమాచార పంపిణీ, కమ్యూనికేషన్ ప్రణాళిక, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (GRM) తదితర అంశాలపై చర్చించారు. రాజధాని రైతుల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారం, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాలు, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు.
అలాగే పర్యావరణ, సామాజిక రక్షణ చర్యలు, సిబ్బంది నియామకాలు, నిబంధనల అమలు, పర్యావరణ, సామాజిక నిర్వహణ ప్రణాళికల పురోగతిని పరిశీలించారు. ఆయా కార్యక్రమాల అమలులో తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంకుల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. అమరావతిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని APCRDA అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయి పర్యటన చేపట్టింది. వైకుంఠపురం పంపింగ్ స్టేషన్, అమరావతిలో రివర్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేయనున్న ప్రాంతాలు, కృష్ణా కరకట్ట E1 రహదారి, CIIP (Critical Infrastructure and Investment Plan) ప్రాజెక్టులో భాగంగా మందడం పంచాయతీలో APCRDA చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించింది. అదేవిధంగా E3 రహదారి (సీడ్ యాక్సిస్ రహదారి) రెండో, మూడో దశ పనుల పురోగతిని కూడా బృందం సమీక్షించింది. ఆయా ప్రాజెక్టుల వివరాలను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు ప్రతినిధులకు వివరించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ పర్యటనలో ప్రపంచ బ్యాంకు మిషన్ బృందం నుంచి క్వింగ్‌యున్ షెన్, రఘు, మాన్షా సెహగల్, యోహన్నెస్ కేసెటే, వెంకట్ బయానా, జోసెఫ్ అక్పోకోడ్జే, రంజన్ వర్మ, వెంకట నూకల, వేదమూర్తి జయదేవప్ప, ఎస్. కృష్ణమూర్తి, మాక్సిమిలియన్ ఫిష్‌బాక్ పాల్గొన్నారు.
ఏడీబీ మిషన్ బృందం నుంచి సంజయ్ జోషి, అశ్విన్ విశ్వనాథ్, శశ్వతి బెల్లియప్ప, హర్షవర్ధన్, జోమ్సీ, కార్లిటో రుఫో తదితరులు పాల్గొన్నారు. మైరా ఎవెలిన్ రావెలో, స్టీఫేన్, అనిత, సంజయ్ మలూ వర్చువల్ విధానంలో సమావేశాల్లో పాల్గొన్నారు.
