ఏపీ మెడ్‌టెక్‌ ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు

-సీఎం చంద్రబాబు నాయకత్వం.. మంత్రి సత్యకుమార్‌ కృషితో ప్రపంచ వేదికపైకి రాష్ట్ర ప్రగతి
-నవంబర్‌ 18న లండన్‌ అంతర్జాతీయ సదస్సులో మెడ్‌టెక్‌ ఆవిష్కరణ గురించి వివరించేందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన మెడ్‌టెక్‌ ఆవిష్కరణల విజయాలను అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. నవంబర్‌ 18న లండన్‌లో నిర్వహించనున్న హెల్త్‌ఏఐ గ్లోబల్‌ గవర్నెన్స్‌ ఫోరమ్‌లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొననుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్‌ యాదవ్‌ కృషితో రాష్ట్రంలో ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజారోగ్య సేవలకు అనుసంధానించే దిశగా చేపట్టిన వినూత్న కార్యక్రమానికి ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఏపీ మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ ద్వారా 18 కృత్రిమ మేధ ఆధారిత వైద్య సాంకేతిక పరిష్కారాలను 14 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి, 12 వేల మందికి పైగా రోగులకు సేవలు అందించడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనంగా నిలిచింది.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌టీఐహెచ్‌), ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ (ఏపీఐఎస్‌) సహకారంతో ఏపీ మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ 2025–26 కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా వైద్య సాంకేతిక రంగంలో వినూత్న పరిష్కారాలను గుర్తించి, ప్రభుత్వ వైద్య వ్యవస్థలో పరీక్షించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి 297 దరఖాస్తులు అందగా, నిపుణుల మూల్యాంకనం అనంతరం 18 వైద్య సాంకేతిక ఆవిష్కరణలను ఎంపిక చేశారు. వీటిని 14 జిల్లాల్లో 37 రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి, 12 వేల మందికి పైగా రోగులకు సేవలు అందించారు.

లండన్‌ వేదికగా విజ్ఞాన మార్పిడి.. పరిశోధన సహకారం

హెల్త్‌ఏఐ గ్లోబల్‌ గవర్నెన్స్‌ ఫోరమ్‌లో ప్రపంచవ్యాప్తంగా వైద్య, సాంకేతిక, ప్రభుత్వ విధానాల రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ వేదికపై ఏపీ మెడ్‌టెక్‌ కార్యక్రమ ఫలితాలను వివరించడంతో పాటు, అంతర్జాతీయ ఉత్తమ విధానాలను తెలుసుకునే అవకాశం రాష్ట్రానికి లభించనుంది.
యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌, వెల్‌కమ్‌ ట్రస్ట్‌, యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ, యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌ తదితర సంస్థల ప్రతినిధులతో విజ్ఞాన మార్పిడి, పరిశోధన సహకారం, వైద్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించనున్నారు.

ప్రపంచ దేశాల ప్రతినిధులతో అంతర్జాతీయ వేదిక

ఈ సదస్సులో భారత్‌, బ్రిటన్‌, సింగపూర్‌, జాంబియా, పెరూ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, నైజీరియా, డెన్మార్క్‌, దక్షిణాఫ్రికా, ఉగాండా, పోర్చుగల్‌, అమెరికా, స్వీడన్‌, బ్రెజిల్‌, స్విట్జర్లాండ్‌, గ్వాటెమాలా, టాంజానియా, సమోవా, కొలంబియా, చైనా, కెనడా, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ తదితర దేశాలకు చెందిన ప్రభుత్వ, వైద్య, పరిశోధనా సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ వినియోగం, బాధ్యతాయుతమైన సాంకేతిక విధానాలు, వైద్య సేవల్లో ఆవిష్కరణల విస్తరణపై చర్చించనున్నారు.

ఏపీ ప్రతినిధిగా లండన్‌ సదస్సుకు వీరపాండియన్‌

లండన్‌లో నవంబర్‌ 18న నిర్వహించనున్న హెల్త్‌ఏఐ గ్లోబల్‌ గవర్నెన్స్‌ ఫోరమ్‌లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధిగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ జి. వీరపాండియన్‌ ఐఏఎస్‌ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రాష్ట్రంలో మెడ్‌టెక్‌ పరిష్కారాల అమలు తీరు, పనితీరు, ప్రజలకు అందిస్తున్న ప్రయోజనాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించనున్నారు.