విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల వ్యయ పరిశీలకులుగా రాజమహేంద్రవరం ఎ.పి రాష్ట్ర అటవీ అకాడమీ ప్రధాన అటవీ సంరక్షణాధికారి & సంచాలకులు బి.విజయ కుమార్, ఐ.ఎఫ్.ఎస్., ని నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ను శనివారం విజయవాడ కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరం నందు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకొని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించడం జరిగింది.
జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయ కుమార్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చులు, బ్యాంకు ఖాతా లావాదేవీలకు సంబంధించి నిర్వహించే ఎన్నికల వ్యయ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేసి పర్యవేక్షించడం, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, వ్యయ పరిమితులను ఏ అభ్యర్థి కూడా ఉల్లంఘించకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన నిఘా ఉంచడం, జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రచార వాహనాలు, ప్రచార సామగ్రి (ఫ్లెక్సీలు, పోస్టర్లు తదితర) ఖర్చులను గుర్తించి, అధికారికంగా సమర్పించే లెక్కలతో సరిపోల్చడం జరుగుతుంది. అలాగే ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వ్యయ పరిశీలన పురోగతి, అభ్యర్థుల ఖర్చుల వివరాలపై ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం నిర్దేశించిన అధికారిక ఇమెయిల్ observers.apsec@gmail.com ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి నేరుగా నివేదికలను సమర్పించనున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరిగే నగదు, బహుమతులు, మద్యం పంపిణీలను అడ్డుకునేందుకు జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లు, వీడియో సర్వైలెన్స్ టీమ్లు, అకౌంటింగ్ బృందాలతో సమన్వయం చేసుకోవడం జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారాన్ని 62810 72815 కు అందజేయాలని బి.విజయ కుమార్ కోరారు.
