నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వేతనంతో కూడిన సెలవు

-ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, వాణిజ్య సంస్థల ఉద్యోగులు, కార్మికులకు సెలవు వర్తింపు
-ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు సాధారణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1, 2026 (ఆదివారం)న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.

ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1316 (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ)తో పాటు కార్మిక శాఖ సవరించిన ఆదేశాల మేరకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం,1988 నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు తమ వద్ద పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను అన్ని యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు.