రామోజీ తెలుగు జాతి కీర్తి..తరతరాలకు స్ఫూర్తి

-అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయన ఆయుధాలు
-రామోజీ సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి
-ఇక నుంచి రాష్ట్ర కార్యక్రమంగా రామోజీ జయంతి
-రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం చంద్రబాబు
-వచ్చే పదేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ : అమిత్‌ షా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విలువల కోసం జీవితాంతం రాజీలేని పోరాటం చేసిన మహనీయుడు పద్మవిభూషణ్‌ రామోజీరావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆయన తెలుగు జాతి కీర్తి, తరతరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. రామోజీరావు స్థాపించిన సంస్థలు తెలుగు జాతికి ఆస్తులని అన్నారు. రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొమ్మిది రంగాల్లో విశిష్ట సేవలందించిన తొమ్మిది మందికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వరుసగా రెండో ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఏటా ఈ వేడుకలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు తన సంకల్పం, క్రమశిక్షణ, విలువలు, నాణ్యత, విశ్వసనీయతతో గొప్ప సంస్థలను స్థాపించి సమర్థంగా నడిపించారని సీఎం వివరించారు. ప్రజల కోసం జర్నలిజాన్ని నమ్ముకుని, అక్షరాన్నే ఆయుధంగా మలచుకుని పోరాటం చేసిన వ్యక్తి అని ప్రశంసించారు. ఈనాడు, మార్గదర్శి, ఈటీవీతో పాటు విలువలతో కూడిన సినిమాలను సమాజానికి అందించారన్నారు. ప్రజా సమస్యలపై స్పందించడంతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఈనాడు సంస్థ ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి పేరు నిర్ణయించే సమయంలో లోతుగా అధ్యయనం చేసి అమరావతి అనే పేరును సూచించారని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణానికి రూ.10 కోట్లు, కరోనా సమయంలో రాష్ట్రానికి మరో రూ.10 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ప్రతి రాత్రి 9 గంటలకు ఈటీవీ వార్తలు చూసి ప్రజలు సమాచారాన్ని తెలుసుకునే స్థాయిలో ఆ సంస్థ విశ్వసనీయత సంపాదించిందన్నారు.

ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలవంచలేదు…

ఎన్ని కష్టాలు, ఒత్తిళ్లు ఎదురైనా రామోజీరావు ఎవరికీ తలవంచలేదని చంద్రబాబు అన్నారు. కోట్లాది మంది పాఠకుల విశ్వాసమే ఆయనకు బలమైన శక్తిగా నిలిచిందన్నారు. విచారణల పేరుతో ఇబ్బందులకు గురిచేసినా, అనారోగ్యంతో మంచంపై ఉన్న వీడియోలను విడుదల చేసి అవమానించే ప్రయత్నాలు చేసినా ఆయన తన పోరాట పంథాను వీడలేదని పేర్కొన్నారు. విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిలబడిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఆయన జయంతి కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరుకావడం రామోజీరావుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని సీఎం చెప్పారు.

రామోజీరావు సేవలు దేశానికి స్ఫూర్తిదాయకం: అమిత్‌ షా

రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. కొందరు వ్యక్తులు తమ కృషితో సంస్థలుగా, వ్యవస్థలుగా మారిపోతారని.. వారి సేవలు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తుల్లో రామోజీరావు ఒకరని పేర్కొన్నారు. రామోజీరావును రామ్‌నాథ్‌ గోయెంకా వంటి విశిష్ట పాత్రికేయులతోనే పోల్చగలమన్నారు.మారుతున్న కాలానికి, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా రామోజీరావు తన సంస్థలను అభివృద్ధి చేశారని అమిత్‌ షా వివరించారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పత్రికను ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిపారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్‌, అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధాల కారణంగా పలు దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నా భారత్‌ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం గత 12 ఏళ్లలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. గతంలో ఏటా వేల సంఖ్యలో నక్సల్‌ దాడులు జరిగేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు.

పదేళ్లలో దేశంలోనే అగ్రస్థానానికి ఏపీ: అమిత్ షా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ నిరంతరం అభివృద్ధి చెందుతోందని అమిత్‌ షా ప్రశంసించారు. రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందా అని తొలుత భావించానని, అయితే చంద్రబాబు రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టారని అన్నారు. దేశంలోని రాష్ట్రాల అభివృద్ధి గణాంకాలను తాను నిశితంగా పరిశీలిస్తుంటానని, వచ్చే పదేళ్లలో చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్రస్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో గూగుల్‌ సంస్థ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టడం రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణమని అన్నారు. అమెరికా వెలుపల గూగుల్‌ ఏర్పాటు చేయనున్న తొలి డేటా సెంటర్‌ ప్రాజెక్టు దేశ డిజిటల్‌ రంగానికి కీలకమవుతుందని పేర్కొన్నారు. విశాఖ తీరంలో సముద్రగర్భం నుంచి ఏర్పాటు చేస్తున్న సబ్‌సీ కేబుల్‌ కూడా అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్టు అని వివరించారు. రాష్ట్రానికి తొలి సెమీకండక్టర్‌ యూనిట్‌, స్టీల్‌ ఫ్యాక్టరీలు, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రానికి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందని ప్రశంసించారు. గతంలో కొందరి తప్పులతో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించి రైతులకు, ప్రజలకు నీరందించేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు.

తొమ్మిది రంగాల్లో విశిష్టులకు పురస్కారాలు

జర్నలిజం, కళలు-సంస్కృతి, గ్రామీణాభివృద్ధి-వ్యవసాయం, మహిళా సాధికారత, సైన్స్‌-టెక్నాలజీ, యూత్‌ ఐకాన్‌, సామాజిక సేవ, విద్య, వైద్య రంగాల్లో విశిష్ట సేవలందించిన తొమ్మిది మందికి కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ లు రామోజీ ఎక్సలెన్స్‌ అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డులు అందుకున్న వారందరికీ నేతలు అభినందనలు తెలిపారు. రామోజీరావు పేరుతో పురస్కారం అందుకోవడం అవార్డు గ్రహీతల జీవితాల్లో మరపురాని, విలువైన ఘట్టంగా నిలిచిపోతుందని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీనివాసవర్మ, కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌ నాయుడు, రామోజీ గ్రూప్‌ సీఎండీ సీహెచ్‌ కిరణ్‌, రామోజీరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.