-క్యూ ఆర్ కోడ్ స్కాన్ చెయ్యండి.. పే చెయ్యండి
-పీజీఆర్ఎస్ వేదిక గా కలక్టరేట్ నోటీసు బోర్డ్ లో క్యూ ఆర్ కోడ్ ప్రదర్శన
-సాయుధ దళాల సేవలను గౌరవిద్దాం – దేశ రక్షణలో సాయుధ దళాల పాత్ర వెలకట్టలేనిది
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరిం చుకుని ప్రతి ఏడాది నిర్వహించే ఫ్లాగ్ డే నిధికి ప్రతీ ఒక్కరూ తమ వంతుగా, అదే విధంగా విరాళాలు సేకరించి జమ చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి జిల్లా ప్రజలకి, ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థినీ విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా శనివారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాగ్ డే నిధికి విరాళ సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణలో సాయుధ దళాల పాత్ర వెలకట్టలేనిదన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికులను స్మరించుకునేందుకు ప్రతీ ఏటా డిసెంబర్ 7వ తేదీన దేశవ్యాప్తంగా ఫ్లాగ్ డే నిర్వహించుకుంటున్నా మన్నారు. ఫ్లాగ్ డే నిధికి విరాళాలను డిజిటల్ చెల్లింపులు ద్వారా జరపాలని కోరారు. కలక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి తమవంతు విరాళాలు అందచేయాలని కోరారు.
దేశ భద్రతా కోసం పనిచేస్తున్న సైనిక కుటుంబాలకు, అటువంటి త్యాగధనుల కుటుంబాలలో వారి పిల్లల స్కాలర్ షిప్స్, ఆడపిల్లలకు వివాహాలు మొదలైన కార్యక్రమాల కొరకు ఫ్లాగ్ డే ఫండ్ ద్వారా సేకరించిన నిధులు ఉపయోగపడుతుందన్నారు. అంతే కాకుండా మన సైనికులు దేశం సరిహద్దులలో పనిచేసిన ఉత్సాహంతో అదే స్ఫూర్తితో దేశంలో వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తమ అమూల్యమైన సహాయ సహకారాలు స్వచ్ఛందంగా అందచేస్తుంటారన్నారు. అటువంటి సైనికులు మాజీ సైనికుల సంక్షేమం పట్ల ఉద్దేశించిన ప్లాక్ డే నిధికి మన వంతు సహకారం అందించడం పౌరులుగా మన కనీస బాధ్యత అని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా జిల్లాలో గల ప్రజలు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, అధికారులు ఫ్లాగ్ డే ఫండు కు విరివిగా చందాలు ఇచ్చి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
విరాళాలు అందచేసే వ్యక్తులు సంస్థలు, జిల్లా సైనిక్ సంక్షేమ కార్యాలయం వారి పేరు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జిల్లా పరిషత్ శాఖ, కాకినాడ బ్రాంచ్ లోని ఖాతా సంఖ్య 62064060623 IFSC కోడ్ SBIN0020974 నేరుగా జమ చేయవచ్చునని జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ డా. సత్యప్రసాద్ తెలియ చేశారు. బ్యాంక్ అకౌంట్ కు చెందిన క్యూఆర్ కోడ్ ప్రదర్శించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె సత్య ప్రసాద్, సూపరింటెండెంట్ జి. చిన్న వెంకటరావు, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ అసోసియేషన్ ప్రతినిధులు జి. చంద్రశేఖర్, ఎమ్. నాగేశ్వర రావు,. అది శేషు, ఇజ్రాయిల్, ఏ. నాగేశ్వర రావు, బాలాజి, పలువురు ఎస్ సి సి విద్యార్ధినులు పాల్గొన్నారు.