-కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్
-ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్
-పూర్వ విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ముందుకి రావాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా నిలబడతాయి. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా విద్యార్ధులందరూ చదువుల్లో రాణిస్తూనే, క్రీడాల్లో కూడా రాణించాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. విజయవాడ పడమట లంకలోని కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల లో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివనాథ్ హాజరైయ్యారు. ఎంపి కేశినేని శివనాథ్ కి స్కూల్ విద్యార్ధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్స్ లో మాత్రమే వుండే పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయటం చూసి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధుల తల్లిదండ్రుల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. విద్యార్ధులు-ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల మధ్య ఒక అవగాహన ఏర్పడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు.
విద్యార్ధులు విద్యలో రాణించటం ఎంతో ముఖ్యమో, అదే విధంగా క్రీడల్లో కూడా నైపుణ్యం పెంపొందించుకుని రాణించాలి.అందు కోసమే తన సొంత నిధులతో ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రౌండ్స్ ను డెవలప్మెంట్ చేస్తున్నట్లు వివరించారు. అలాగే జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు సూచనలతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకి ఎనిమిది క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ కిట్ ను త్వరలో అందించనున్నట్లు తెలిపారు. విద్యార్ధుల్లోని క్రీడ ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని మంచి స్థానాల్లో వున్న పూర్వ విద్యార్ధులు స్కూల్స్ అభివృద్దికి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు, ప్రధానోపాధ్యాయులు మురళీ కృష్ణ, జిల్లా వైద్యాధికారి సుహాసిని, పాఠశాల సెక్రటరీ రాజ్యలక్ష్మీలతో పాటు విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.