-విద్యా ప్రమాణాలు మరింత పెంచేందుకు కృషి
-తల్లిదండ్రులు, దాతల సలహాలతో మరింత అభివృద్ధికి చర్యలు
-నున్న హైస్కూల్‌లో దాతల సహకారంతో మౌలిక సదుపాయాల కల్పన భేష్
-మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ బడులను మరింత అభివృద్ధి చేయడంతోపాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ లక్ష్మీశ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యా బోధన చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్‌తో స్కూళ్లతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు విద్యా, క్రీడా, సాంకేతిక రంగాలలో అద్భుతంగా రాణిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రభుత్వ స్కూళ్లను మరింత అభివృద్ధి చేయడంతోపాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును అందించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పేరుతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన్నట్లు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు (మెగా పీటీఎం) కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తొలుత కలెక్టర్‌కు పాఠశాలల ఉపాధ్యాయ బృందం ఘనంగా స్వాగతం పలికింది. ఆ తర్వాత ఆయన నేరుగా విద్యార్థుల వద్దకు వెళ్లి పాఠశాలలో విద్యా బోధన, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలలో మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం ఎన్‌సీసీ కేడెట్ నుంచి కలెక్టర్ లక్ష్మీశ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించి పిల్లల యోగ క్షేమాలు, విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే దాతల సహకారంతో నిర్మించిన మర్రెడ్డి సీతారావమ్మ సైన్స్ లేబోరేటరీని పరిశీలించారు. సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో అందరి అభిప్రాయాలను స్వీకరించి అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతోపాటు విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా వ్యాప్తంగా 939 పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించిన్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమ పిల్లల చదువు, క్రమశిక్షణ, వారిలో ఉన్న ప్రతిభను తెలుసుకునేందుకు తల్లిదండ్రులు తరలిరావడం చరిత్రలో ఇదే తొలిసారని, అందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఏ విధంగా ఉన్నత ప్రమాణాలతో బోధిస్తున్నారనే విషయం తెలుసుకునేందుకు ఇటువంటి మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మి శ అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతోందని దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ మెగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఈతరహా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.
ఇదిలావుండగా, హైస్కూల్‌కు హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ పేరుతో విద్యాశాఖ ప్రధానం చేసే స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లె్న్స్ రావడం, విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించటాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే క్విజ్‌లోనూ, సాంకేతిక పరిజ్ఞానంలోనూ నాసా నుంచి బహుమతులు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులలో తల్లిదండ్రులకు కూడా తెలియని ప్రతిభ దాగి ఉంటుందని, దానిని వెలికితీసేది ఉపాధ్యాయులేనన్నారు. అందుకే వారితో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల అభిరుచులను తెలుసుకుని, వారికి ఇష్టం ఉన్న రంగాలలో ప్రోత్సహించాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. విద్యార్థులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరిచి, తల్లిదండ్రులకు తెలియజేసే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల గురించి కలెక్టర్ తల్లిదండ్రులకు వివరించారు. అందులో వారి చదువు, మార్కులు, హాజరు, ఇతర ప్రతిభాపాటవాలు పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
దాతల సహకారం మరువలేనిది
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో దాతల సహకారం మరువలేనిదని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. నున్న హైస్కూల్‌లో చదువుకున్న విద్యార్థులు నేడు అనేక మంది ఉన్నత పదవులలో ఉండటం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఏపాటిదో స్పష్టం చేస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసిన మున్నంగి వెంకట సీతారామిరెడ్డి ఇక్కడ చదువుకోవడమే కాకుండా పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించడం ముదావహమన్నారు. అలాగే దాతలు అనేక మంది ముందుకు వచ్చి అదనపు తరగతి గదులు, సైన్స్ లేబోరేటరీ, డైనింగ్ హాల్, సైకిల్ షెడ్ తదితర వాటిని సమకూర్చడం హర్షణీయమన్నారు. పూర్వ విద్యార్థులను నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భవిష్యత్‌లో స్థిరపడిన తర్వాత తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పూర్వ విద్యార్థుల నుంచి రూ.50 లక్షల విరాళం సమీకరించి అదనపు తరగతి గదులు, సైన్స్ లేబోరేటరీ, డైనింగ్ హాల్, సైకిల్ షెడ్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన నరెడ్ల సత్యనారాయణరెడ్డిని కలెక్టర్ లక్ష్మీశ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయ పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. అలాగే విద్యార్థులు ప్రదర్శరించిన సాంస్కృతి కార్యక్రమాలను కలెక్టర్ తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం కలెక్టర్ లక్ష్మీశను ఘనంగా సత్కరించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వజ్రాల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల తహశీల్దార్ బీ సుగుణ, ఉప సర్పంచ్ కలకోటి బ్రహ్మానందరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు బొంతు సరోజిని, విద్యా కమిటీ చైర్మన్ జీ కుమార్, నున్న రూరల్ ఎస్ఐ ఎన్ విమల తదితరులు పాల్గొన్నారు.