-ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేది ఏప్రిల్ 10.
-ఏప్రిల్ 16,17 తేదీల్లో రాతపరీక్ష
-నోటిఫికేషన్ జారీ చేసిన పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు.వి ఐఏఎస్.,
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని 13 జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIETలు)ను బలోపేతం చేయడానికి డిప్యూటేషన్ పద్ధతిలో అధ్యాపకుల భర్తీ చేపడుతున్నట్లు మంగళవారం పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు.వి ఐఏఎస్., నోటిఫికేషన్ జారీ చేశారు. 2025-26 సంవత్సరానికి అర్హులైన పాఠశాల సహాయకులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
అర్హతలివీ
అర్హతగలవారు సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం మార్కులు, ఎంఈడిలో 55 శాతం మార్కులు కలిగి ఉండి, స్కూల్ అసిస్టెంట్ గా కనీసం ఐదేళ్లు అనుభవం, అభ్యర్థుల గరిష్ట వయసు 58 సంవత్సరాల లోపు ఉండాలనే అర్హతలు పేర్కొన్నారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 10. ఆసక్తిగలవారు https://forms.gle/4unKU4g6moktyp5Q6 లింక్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసి, తర్వాత హార్డ్ కాపీని జిల్లా విద్యాశాఖ అధికారి వారి ద్వారా డైట్ ప్రిన్సిపల్ కి సమర్పించాలని తెలిపారు.
ఎంపిక ఇలా:
• జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా విద్యాశాఖాధికారి కన్వినర్ గా, సంబంధిత డైట్ ప్రిన్సిపల్ మెంబరుగా వ్యవహరిస్తారు.
• ఈ ఖాళీల భర్తీ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. వచ్చిన దరఖాస్తులు 11న పరిశీలన, 16, 17 తేదీల్లో రాత పరీక్ష, 19న ఇంటర్వ్యూ, ఎంపికైన వారికి 21న డిప్యూటేషన్ ఆర్డర్లు, 22న కేటాయించిన డైట్ కళాశాలల్లో చేరాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.