Breaking News

తొలివిడత నాడు–నేడు కింద ఆధునికీకరణ చేపట్టిన ప్రభుత్వ స్కూళ్లను అంకితం చేసిన సీఎం వైయస్‌.జగన్‌

 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం తొలివిడత నాడు–నేడు కింద ఆధునికీకరణ చేపట్టిన ప్రభుత్వ స్కూళ్లను సీఎం వైయస్‌.జగన్‌ అంకితం చేసారు.  రెండో విడత నాడు–నేడు పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. విద్యార్ధులకు విద్యాకానుక కిట్స్‌ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. పి.గన్నవరం నియోజకవర్గంలో ఇక్కడున్న చిట్టిపిల్లలు, అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మూడు కార్యక్రమాలుకు నాంది…
ఈ రోజు ఇక్కడ మూడు కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇందులో మొదటిది ఈ రోజు నుంచి బడులు తెరుచుకుంటున్నాయి. కోవిడ్‌ తీవ్రత కారణంగా బడులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసి ఉన్న పరిస్థితులు మనందరికీ తెలిసినవే. దాదాపుగా ఇప్పటికే పిల్లలు పరీక్షలు కూడా రాయకుండానే రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ వాళ్లు అందరూ బడులు తెరవాలి, బడులు తెరుచుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తూనే బడులు…
ఇటువంటి పరిస్థితుల్లో బడులన్నీ పూర్తిగా తెరిచే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పూర్తిగా ఫాలోఅవుతూనే బడులు తెరవాలని ఆదేశాలు కూడా ఇచ్చాం. గ్రామ సచివాలయం ఒక యూనిట్‌గా తీసుకుని పాజిటివిటీ రేటు పదిశాతం కన్నా తక్కువ ఉన్న ప్రతిచోటా కూడా బడులు కచ్చితంగా తెరవాలని ఆదేశాలు ఇచ్చాం. ఒక్కో గదిలో 20 మందికి మించి ఉండకుండా క్లాసులు జరగాలని ఆదేశాలు ఇచ్చాం. సెక్షన్‌ స్ట్రెంగ్త్‌ 20 కంటే ఎక్కువ ఉంటే రోజు తప్పించి రోజు తరగతులు జరుగుతాయి.

టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌…
టీచర్లు అందరికీ వ్యాక్సినేషన్‌ ఇచ్చాం. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలని ఆదేశాలు ఇచ్చాం. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తులు తీసుకుంటూ ఈ రోజు వివరంగా గైడ్‌లైన్స్‌ కూడా ఇచ్చాం.

పేద పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా…
బడులైనా, పరీక్షలైనా, విద్యా వ్యవస్ధలో మార్పులైనా, సీబీఎస్‌ఈ, ఇంగ్లిషు మీడియం సిలబస్‌ అయినా, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ అయినా, పిల్లల తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో డబ్బులు నేరుగా ఆ తల్లుల అకౌంట్లలోకి వెయ్యడమైనా… ఏ నిర్ణయం తీసుకున్నా ఒక పేదకుటుంబలో అక్కచెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా పిల్లలందరికీ కూడా ఒక మంచి మేనమామగా వారందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాం.

మంచి ఉద్యోగాలు రావాలన్న తపనతోనే…
ఈ పిల్లలు ఈరోజు గవర్నమెంటు బడుల్లో చదువుతున్నారు. రేపొద్దున ఈ పిల్లలు మరో ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలలోపు అందరూ కూడా గ్రాడ్యుయేట్లు అవుతారు. అప్పుడు వీళ్లందరికీ మంచి ఉద్యోగాలు రావాలి, మంచి జీతాలు రావాలి. కుటుంబాల రూపురేఖలు, భవిష్యత్తు మారాలనే తపన, తాపత్రయంతో చదువుల మీద ఇంతగా ధ్యాస, శ్రద్ధ పెట్టి అడుగులు వేస్తున్నాం.

జగనన్న విద్యా కానుక…
ఇవాళ జరుగుతున్న రెండోకార్యక్రమం జగనన్న విద్యాకానుక. ఈరోజు ఈ కార్యక్రమంలో 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యాకానుక పథకాన్ని ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాను. విద్యాకానుకగా ఏమిస్తున్నామో మీ అందరికీ తెలుసు.
విద్యాకానుకలో ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకి ఒక మంచి స్కూల్‌ బ్యాగు, బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ (ద్విభాషా పాఠ్యపుస్తకాలు) అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీలో ఇంగ్లిషు టెక్ట్స్‌ బుక్స్, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌తో పాటు ఈ సారి కొత్తగా డిక్షనరీ కూడా ఇస్తున్నాం.
ఐదో తరగతి వరకు చదివే పిల్లలకు ఇచ్చే డిక్షనరీలో అయితే బాగా అర్ధం అయ్యేందుకు డిక్షనరీలో పదంతో పాటు బొమ్మలు కూడా పెట్టారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇచ్చే డిక్షనరీలో ఎక్కువ పదాలు అవసం కాబట్టి సైజు పెంచి ఇస్తున్నాం. ఇంకా బెల్టు, బూట్లు, రెండు జతల సాక్సులు, కుట్టుకూలి డబ్బులతో సహా మూడు జతల యూనిఫాంలు కలిపి విద్యాకానుక కిట్‌గా ఇస్తున్నాం.

రెండేళ్లలో విద్యాకానుకకు రూ.1380 కోట్లు…
జగనన్న విద్యాకానుక ద్వారా ఈ రెండు సంవత్సరాలలో ఈ ఒక్క పథకానికే అక్షరాలా దాదాపుగా రూ.1380 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ సంవత్సరం 47.32 లక్షల మంది విద్యార్ధులకు రూ.731 కోట్లతో విద్యాకానుక కిట్‌లు ఇస్తున్నాం.

నాణ్యతలో రాజీ లేకుండా…
వీటి నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా లోపాలను సవరించి గతేడాది కన్నా ఈ దఫా మంచి నాణ్యతతో కూడిన వస్తువులు ఇచ్చాం. పిల్లలకిచ్చే బ్యాగుల్లో భుజంపై కుషన్‌ ఉంటే బాగుంటుందని చెపితే… ఈ దఫా అది కూడా ఏర్పాటు చేయించాం. ఇంత డీటైల్డ్‌గా క్వాలిటీ చూసి ప్రతి ఐటెం ఇస్తున్నాం. కారణం ఇది మన పిల్లలకు ఒక మేనమామ ఇస్తున్నాడు కాబట్టి ఇంతలా ఆలోచించి చేస్తున్నాం.

మనబడి నాడు–నేడు…
మూడో కార్యక్రమం మనబడి నాడు–నేడు. నిన్నటితో మొదటిదశ 15,700 స్కూళ్లకు సంబంధించి మనబడి నాడు–నేడు పూర్తి చేశాం. రెండోదశ కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. మనబడి నాడు–నేడుతో గవర్నమెంటు బడులు, హాస్టళ్ల రూపురేఖలు అన్నీ మారుస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంటు స్కూలునీ కార్పొరేట్‌ స్కూల్స్‌కి ధీటుగా తీర్చిదిద్దబోతున్నాం.

నాడు–నేడు పది మార్పులు…
నాడు నేడు ద్వారా ప్రతి గవర్నమెంటు బడిలో పది మార్పులు స్పష్టంగా కనిపించేలా అభివృద్ది చేస్తున్నాం.
ఈ పది మార్పుల్లో విద్యార్ధులకు, ఉపాధ్యాయులందరికీ కొత్త ఫర్నీచర్‌ అందుబాటులోకి తెస్తున్నాం. రెండోది ప్రతి స్కూల్‌లోనూ మినరల్‌ వాటర్‌ ప్లాంటుతో మంచినీటి సదుపాయం కల్పించడంతో పాటు ఆ మంచి నీళ్లలో ఉన్న పీహెచ్‌ బ్యాలెన్స్‌ను కూడా ధృవీకరించే ల్యాబ్‌ సర్టిఫికేట్‌ కూడా జత చేస్తున్నాం. ప్రతి స్కూళ్లోనూ మంచి టాయ్‌లెట్స్‌ లేని పరిస్ధితిని నా కళ్లారా చూశాను. దాన్ని రిపేరు చేస్తూ.. ప్రతి స్కూల్లో మంచి టాయ్‌లెట్స్‌ను రన్నింగ్‌ వాటర్‌తో నాడు నేడులో మూడో కార్యక్రమంగా ఏర్పాటు చేస్తున్నాం.
ప్రతి స్కూల్లోనూ పెయింట్స్‌ వేయని పరిస్థితిని దశాబ్ధాలుగా చూస్తున్నాం… ఆ పరిస్థితిని మార్చుతూ ప్రతి స్కూళ్లోనూ మంచి పెయింట్స్‌ వేయడం నాలుగో కార్యక్రమంగా చేస్తున్నాం.
ఇంకా ప్రతి స్కూల్‌కి కాంపౌండ్‌ వాల్‌ నిర్మించడం, అవసరమైన మరమత్తులు చేయడం, అవసరమైన చోట అదనపు క్లాస్‌రూంలు కట్టడం, గ్రీన్‌ చాక్‌ బోర్డ్స్‌ ఏర్పాటు చేయడం, ప్రతి క్లాస్‌రూంలో కరెంటు సరఫరాతో పాటు ఫ్యాన్లు, ట్యూబులైట్లు ఏర్పాటు, ప్రతి స్కూళ్లోనూ మంచి ఆహారం పిల్లలకు అందించాలని తపన పడుతున్న పరిస్థితుల్లో మంచి కిచెన్‌ ఉండాలి అని దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం.

ప్రతి స్కూల్లోనూ ఇంగ్లిషు ల్యాబ్‌…
చివరిగా పదో అంశంగా ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు ఒక ల్యాబ్‌ కూడా పెట్టాం. పిల్లలందరికీ ఇంగ్లిషుతో సత్సంబంధాలు ఏర్పడే విధంగా అక్కడ టీవీల్లో ఇంగ్లిషు కార్యక్రమాలు చూపిస్తారు.

మనబడి నాడు–నేడు 57 వేల స్కూళ్లలో సమూల మార్పులు…
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 45వేలకు పైగా ప్రభుత్వ విద్యాసంస్ధలతో పాటు ప్రీ ప్రైమరీలుగా, పౌండేషన్‌ స్కూల్స్‌గా మారుతున్న అంగన్‌వాడీలను కూడా మనబడి నాడు–నేడు కార్యక్రమంలోకి తీసుకువచ్చాం. మనబడి నాడు–నేడు ద్వారా అక్షరాలా 57వేల స్కూళ్ల రూపురేఖలు మారబోతున్నాయి. ఇందుకోసం మనందరి ప్రభుత్వం అక్షరాలా రూ.16వేల కోట్ల ఖర్చు చేయబోతుంది.

ఆరు రకాల స్కూల్స్‌…
ఇకపై స్కూల్స్‌ అన్నీ ఆరు రకాలుగా ఉండబోతున్నాయి. అవి ఎందుకలా ఉండబోతున్నాయి, వాటి వల్ల జరిగే మంచి ఏమిటనేది రెండు నిమిషాల టైం తీసుకుని చెప్తాను. మన గ్రామంలోనే పంచాయతీలో కాకుండా హేమ్లెట్‌ విలేజీలో శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌గా మార్చి పెట్టబోతున్నాం. ఇక్కడ ప్రీ ప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2 క్లాసులతో ఉంటాయి. ఈ శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌ అన్నీ కిలోమీటరు లోపల ఉన్న పౌండేషన్‌ స్కూల్స్‌తో అనుసంధానం అయి పనిచేస్తాయి.

గ్రామం నుంచి కిలోమీటరు దూరంలోనే పౌండేషన్‌ స్కూల్స్‌ రాబోతున్నాయి. ఇవి రెండో రకం.
ఇక్కడ పీపీ1, పీపీ2తో పాటు 1,2 తరగతులు కూడా ఉంటాయి.
మూడో కేటగిరీ పౌండేషన్‌ స్కూల్స్‌ ప్లస్‌ అని తీసుకొస్తున్నాం. ఇక్కడ పీపీ1, పీపీ2, 1,2,3,4,5 తరగతులు ఉంటాయి.
నాలుగో కేటగిరీ కింద ప్రీ హైస్కూల్స్‌ తీసుకొస్తున్నాం. ఇక్కడ 3 నుంచి 7,8 తరగతుల వరకు ఉంటాయి.
ఐదో కేటగీరీ కింద హైస్కూల్స్‌ను తీసుకొస్తున్నాం. ఇక్కడ 3వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఉంటాయి.
ఆరో కేటగిరీ కింద హైస్కూల్‌ ప్లస్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో 3 వ తరగతి నుంచి 12 తరగతి వరకు అందుబాటులో తీసుకొస్తున్నాం.

హేమ్లెట్‌ విలేజీలో శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌ కనిపిస్తాయి. ఒక కిలోమీటరు లోపే పౌండేషన్‌ స్కూల్స్‌ వ్యవస్ధ అంతా ఉంటుంది. మూడు కిలోమీటర్ల లోపే హైస్కూల్స్‌కి సంబంధించిన వ్యవస్ద అంతా ఉంటుంది.
ఇలా వర్గీకరించి ఆరు రకాలుగా ఈ స్కూల్స్‌ ఆన్నింటిని తీసుకొస్తున్నాం. 57వేల స్కూల్స్‌ను వీటి పరిధిలోకి తీసుకొచ్చి, నాడు–నేడులోకి అనుసంధానం చేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం.

ఈ రకంగా ఆరు కేటగిరీలుగా తీసుకురావడం వల్ల జరిగే మేలు ఏమిటన్నది ముఖ్యమైన అంశం. అది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.

ఏఎస్‌ఈఆర్‌ సర్వే ప్రకారం…
ఈ మధ్యకాలంలో ఏసర్‌ (ఏఎస్‌ఈఆర్‌) సర్వే చేసింది. సర్వేలో వాళ్లు మూడోతరగతి పిల్లాడికి రెండో తరగతి పుస్తకమిచ్చి చదవండి అంటే.. కేవలం 22 శాతం పిల్లలు మాత్రమే చదవగలిగారు. మిగిలిన వాళ్లు చదవలేకపోయారు. ఇటువంటి దారుణమైన పరిస్ధితుల్లో ఉన్న మన చదువుల స్ధితిని పూర్తిగా మార్చడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం.

ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 18 సబ్జెక్టులు ఉంటే ఒకే టీచరు ప్రతి క్లాసుకు, ప్రతి సబ్జెక్టును చెప్పడం ద్వారా టీచర్‌ టు చైల్డ్‌ రేషియో మెయింటైన్‌ కావడం లేదు. ఒకే టీచర్‌ అన్ని సబ్జెక్టులు, అన్ని క్లాసులు చెప్పడం వల్ల ఆ పిల్లలకు ఆ సబ్జెక్టులపై ఫోకస్‌ రాక పూర్తి అవగాహన రాకుండా పోతుంది.

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే…
ఈ పరిస్థితిని చక్కదిద్దుతూ ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్, ప్రతి క్లాసుకూ ఒక టీచర్‌ ఉండేటట్టుగా మార్పులు తేవడం కోసమే స్కూల్స్‌ అన్నీ కేటగిరైజ్‌ చేసి మార్పులు చేస్తున్నాం.
ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్, ప్రతి క్లాసుకు ఒక టీచర్‌ తీసుకురావాలన్న తపన, తాపత్రయంతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

పిల్లలు కోసం మనం చేస్తున్న కార్యక్రమాలు…
పిల్లలందరి కోసం గత రెండు సంవత్సరాలుగా మనం చేస్తున్న అమ్మఒడి, గోరుముద్ద, నాడు–నేడు కార్యక్రమాలు వల్ల జరిగిన మంచి ఏమిటన్నది క్లుప్తంగా చెప్తాను.

2018–19 సంవత్సరం అంటే మనం అధికారంలోకి రాక ముందు, గత ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో ప్రైవేటు, గవర్నమెంటు స్కూల్స్‌లో మొత్తం కలిపి 1 నుంచి 10 వతరగతి వరకు చదివే పిల్లల సంఖ్య 70.43 లక్షలు. కోవిడ్‌ వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవాళ ఆ సంఖ్య 73.05 లక్షలకు పెరిగింది.

కేవలం ప్రభుత్వ బడులు తీసుకుంటే 2018–19లో 37.20 లక్షల పిల్లలు చదువుతుంటే… ఇవాళ అవే బడుల్లో 43.43 లక్షల మంది చదువుతున్నారు. మన ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్ల ప్రతి తల్లిలోనూ, ప్రతి బిడ్డలోనూ నమ్మకం పెరిగింది. ఈ ప్రభుత్వం మా మంచి గురించి ఆలోచన చేస్తుంది అన్న ఆత్మవిశ్వాసం తల్లుల్లోనూ, పిల్లల్లోనూ కనిపిస్తుంది.

ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. డిగ్రీ లేదా ప్రొఫెషనల్‌ విద్య వరకూ హక్కుగా చదువుకునేట్టుగా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ అమ్మఒడి, గోరుముద్ద, నాడు నేడు, సంపూర్ణ పోషణ దగ్గర నుంచి పిల్లలు పైతరగతులకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు విద్యాదీవెన, వసతి దీవెన కూడా తీసుకొస్తున్నాం. విద్యాకానుక ఇవాలే ఇస్తున్నాం.

ఈ పథకాలన్నీ గమనిస్తే…
జగనన్న అమ్మఒడి ద్వారా 44,48,865 మంది తల్లులకు రెండేళ్లలో అక్షరాలా రూ.13వేల కోట్లు ఇవ్వగలిగాం.
జగనన్న విద్యాదీవెన వల్ల 18,80,934 మంది పిల్లలకు రూ.5573 కోట్లు ఇచ్చాం.
జగనన్న వసతి దీవెన 15,56,956 మంది పిల్లలకు రూ. 2269 కోట్లు ఇచ్చాం.
జగనన్న గోరుముద్ద ద్వారా 37 లక్షల మంది పిల్లలకు రెండేళ్లలో రూ.3200 కోట్లు ఖర్చు చేశాం.
జగనన్న విద్యా కానుక ద్వారా 47,32,064 మంది పిల్లలకు రూ.1379 కోట్లు ఖర్చు పెట్టాం.
మనబడి నాడు–నేడు ద్వారా మొదటి దశలో 15,715 స్కూళ్లను రూ.3600 కోట్లు ఖర్చుతో బాగుచేశాం.
సంపూర్ణపోషణతో మరో 30,16,000 మందికి మేలు జరిగేలా రూ.3600 కోట్లు ఖర్చు చేశాం.
మొత్తంగా మిగిలినవి అన్నీ పక్కనపెడితే కేవలం పైన చెప్పిన ఈ పథకాల కోసమే రూ.32,714 కోట్లు రెండేళ్లలో ఖర్చు పెట్టాం.

పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు…
ఈ కార్యక్రమాల వల్ల పిల్లలు బాగా చదవాలని కోరుకుంటున్నాను. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే అని బలంగా నమ్ముతున్నాను. ఆ చదువు వల్ల పిల్లలు తమ కాలుమీద తాము నిలబడాలని, రాబోయే రోజులలో పోటీ వాతావరణాన్ని తట్టుకోవాలని, వారి భవిష్యత్‌ మారాలని, పేదరికంలో ఉన్న పిల్లలు చదువు అనే అస్త్రంతో పేదరికాన్ని దాటాలని మనసా, వాచా , కర్మణా కోరుకుంటున్నాను.
మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే చిట్టిబాబు మాట్లాడుతూ.. తొగరపాయి బ్రిడ్జి, అప్పనపల్లి లిప్ట్, మొండెపులంక ఛానెల్‌ ఆధునికీకరణ చేయాలన్నారు. ఈ మూడింటిని మంజూరు చేస్తున్నాను.

చివరగా…
ప్రతి చిన్నారికి మంచి జరగాలని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు వీరిని చదివించే బాధ్యతలో కష్టం రాకూదు, చిరునవ్వుతో చదివించే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను.
దేవుని దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ప్రభుత్వం పై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

కార్యక్రమంలో భాగంగా నాడు–నేడు మొదటిదశలో అభివృద్ధిచేసిన స్కూళ్లను అంకితం చేయడంతో పాటు .. రెండో దశ నాడు–నేడు పనులకూ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ శ్రీకారం చుట్టారు.
అనంతరం విద్యాకానుక కిట్స్‌ను ముఖ్యమంత్రి స్వయంగా చిన్నారులకు అందించారు.

పి.గన్నవరం జెడ్పీపీ హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, విద్యార్ధులు ఏమన్నారంటే…వారి మాటల్లోనే

ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి

ఏపీని విద్యారంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపి, అక్షర సేద్యం చేస్తూ నాడు నేడు పేరుతో చేపట్టిన ఈ మహాయజ్ఞంలో తొలిఘట్టం పూర్తిచేసుకుని రెండో విడత ప్రారంభించేందుకు ముందడుగు వేస్తున్న థీరుడు శ్రీ వైఎస్‌ జగన్‌. విద్య ఆవశ్యకత, విద్య ద్వారా ఏ విధంగా సమాజాభివృద్ది జరుగుతుందో మహనీయులు చెప్పారు. బీఆర్‌ అంబేద్కర్, నెల్సన్‌ మండేలా, అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ వంటి మహనీయులు విద్య ఆవశ్యకతను చెప్పారు. వీరి బాటలో వారి ఆదర్శాలను పుణికిపుచ్చుకుని ముందుకు సాగుతున్న వారు శ్రీ వైఎస్‌ జగన్‌. జగనన్న చెప్పారంటే చెస్తాడంతే అన్న నమ్మకం ప్రజలకు వచ్చింది. గత పాలకులు ప్రైవేట్‌ విద్యను ప్రోత్సహించిన సమయంలో మన జగనన్న మాత్రం పాఠశాలల రూపురేఖలు మార్చుతానని ఇచ్చిన మాట మేరకు నాడు నేడు ద్వారా స్కూళ్ళ స్ధితిగతులు మార్చిన ధీరుడు. ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాయి, మీరు చేసిన అభివృద్దిని చూడండి. రాష్ట్రంలో ఉన్న ఏ స్కూల్‌ అయినా చూడండి. కరోనా కష్టాలు ఉన్నా కూడా మొదటి విడత పూర్తిచేసి రెండో విడత పనులకు శ్రీకారం చుడుతున్నారు. మా జన్మ ఉన్నంతవరకూ మేం జననన్న వెంటే ఉంటాం. ఈ రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు ఒక తమ్ముడిగా, అన్నగా, పిల్లల బాగోగులు చూసే మేనమామగా వారి బాగోగులు చూస్తున్నారు. సీఎంగారు స్వయంగా పర్యవేక్షించి నాడు నేడు రూపకల్పన చేశారు. దళితులు, అణగారిన వర్గాలకు కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. పిల్లలంతా జగనన్నా మా మేనమామ నువ్వే అంటూ సంతోషంగా ఉన్నారు, మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. విద్యారంగానికి మీరు చేస్తున్న కృషిని ఎన్నటికీ మరువలేం, ధన్యవాదాలు…

ప్రణవి, 5 వ తరగతి విద్యార్ధిని, ఎంపీపీ స్కూల్, మొగలికుదురు
మల్లె వంటి మనసుతో ఇక్కడికి విచ్చేసిన మన జగన్‌ మామయ్యకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చదివే పాఠశాలలోనే మా నాన్నగారు హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. ప్రతీ రోజూ మా నాన్నగారితోనే నేను పాఠశాలకు వెళుతున్నాను. మన చదువుల కోసం మన జగన్‌ మామయ్య చేసిన సేవలను మనం తప్పక తెలుసుకోవాలి. పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి ఏడాదికి రూ. 15 వేలు అమ్మ ఒడి ద్వారా అందిస్తున్నారు. గతంలో నేను స్కూల్‌కి వెళ్ళేటప్పుడు అమ్మ రోజూ లంచ్‌ బాక్స్‌ పెట్టేది కానీ ఇప్పుడు మాత్రం రోజూ జగన్‌ మామయ్య సీఎం అయిన తర్వాత మా అందరికీ రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రోజుకొక వైరైటీ ఫుడ్‌ ఇస్తున్నారు, సోమవారం కోడిగుడ్డు కూర, మంగళవారం పులిహోర, పప్పు, టమాట కూర, బుధవారం వెజిటెబుల్‌ ఫ్రైడ్‌ రైస్, గురువారం కిచిడీ, శుక్రువారం పప్పు, ఆకుకూర, శనివారం సాంబార్, చక్కెర పొంగలి, వీటితో పాటు వారానికి 5 కోడిగుడ్లు, చిక్కీలు తింటున్నాం. మాకు ఇలాంటి రుచికరమైన భోజనం అందిస్తున్నందుకు జగన్‌ మామయ్యకు చాలా చాలా ధ్యాంక్స్‌. గతంలో బాత్‌రూమ్‌కు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు రన్నింగ్‌ వాటర్‌తో పరిశుభ్రంగా ఉన్నాయి. నేను పెద్దయ్యాక మ్యా«ద్స్‌ టీచర్‌ అవ్వాలనుకుంటున్నాను. వన్‌ చైల్డ్, వన్‌ టీచర్, వన్‌ బుక్, వన్‌ పెన్‌ కెన్‌ చేంజ్‌ ద వరల్డ్‌ అని నమ్మిన మన సీఎం మామయ్య మన కలలను నెరవేరుస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంది. పేదల కోసం, విద్యార్ధుల కోసం, మనందరి కోసం మన సీఎం మామయ్య చేస్తున్న అభివృద్ది పనులు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి నా వయసు చాలదు. రాష్ట్ర అభివృద్దిలో మనమందరం మన సీఎంగారి బాటలో కలిసి ప్రయాణిద్దాం. అందరికీ ధన్యవాదాలు

కే. సాయి శరణ్య, 10 వ తరగతి, జెడ్పీపీ హైస్కూల్, పి.గన్నవరం
నేను ప్రభుత్వ హైస్కూల్‌లో చదువుతున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. నా తండ్రి టైలర్, మా అమ్మ గృహిణి. నేను 8 వ తరగతి నుంచి ఈ స్కూల్‌లో చదువుతున్నాను. మీరు విద్యారంగం అభివృద్దికి చేస్తున్న కృషికి ప్రత్యేక ధన్యవాదాలు. జగన్‌ మామయ్య మీరు విద్యారంగంలో మాకోసం చేస్తున్న అభివృద్ది కారణంగా నూతన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం, అనేక అవకాశాలు కూడా వస్తున్నాయి. మాలాంటి పేద విద్యార్ధులు మీ వల్ల ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. మా జీవితంలో మేం సాధించలేని గోల్స్‌ను కూడా మీ కారణంగా సాధించగలుగుతున్నాం. ప్రతీ విద్యార్ధి కూడా నాణ్యమైన విద్యను అందుకోగలుగుతున్నారు. జగనన్న విద్యా కానుక కిట్‌ చాలా బావుంది. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన ఇలాంటి అనేక పథకాలు గతంలో ఎన్నడూ చూడలేదు. బీఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్లు విద్య ఒక్కటే పేదరికాన్ని దూరం చేసి, సామాజిక గౌరవాన్ని పెంచుతుందన్న మాటను మీరు నిజం చేస్తున్నారు. జగన్‌ మామ విలువైన సమయాన్ని విద్యారంగం అభివృద్దికి వెచ్చిస్తున్నారు. మన బడి నాడు నేడు పథకం విద్యార్ధులకు కోహినూర్‌ వజ్రం లాంటింది. ఇందులో సందేహం లేదు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలన్నీ మారిపోయాయి. జగన్‌ మామా మాకు మంచి బలవర్ధకమైన భోజనం ఇస్తున్నారు, అంతేకాదు మా కుటుంబం కూడా చాలా లబ్దిపొందుతుంది. మా నాన్నకు వికలాంగుల ఫించన్‌ వస్తుంది, మా అమ్మకు అమ్మ ఒడి రెండు సార్లు వచ్చింది, దీంతో మేం నా ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం మొబైల్‌ ఫోన్‌ కూడా తీసుకున్నాం. జగన్‌ మామ కూడా తన తండ్రిగారు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిగారిలా ప్రతీ ఒక్కరి గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోతారు, ధ్యాంక్యూ జగన్‌ మామయ్యా…

ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *