-తెల్లరేషన్ కార్డు ఉన్న భక్తులు ఉచితంగా పాల్గొనే అవకాశం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 27వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. 27వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహామండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. టికెట్ ధరను రూ.1,500గా దేవస్థానం నిర్ణయించింది. టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు దేవస్థానమే పూజా సామాగ్రిని సమకూర్చుతుంది. భక్తులు టికెట్లను దేవదాయ ధర్మాదాయ శాఖ వెబ్‌సైట్ https://tms.ap.gov.in ద్వారా, దేవస్థాన ఆర్జిత సేవా టికెట్ల కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చునని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అలాగే, 27వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగే ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే అవకాశాన్ని భక్తులకు దేవస్థానం కల్పించింది. ఇందుకోసం తెల్లరేషన్ కార్డు ఉన్న భక్తులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 23వ తేదీ నుంచి దేవస్థానం దరఖాస్తులను పంపిణీ చేస్తుంది. దరఖాస్తులను మహా మండపం గ్రౌండ్ ఫ్లోర్‌లోని టోల్ ఫ్రీ కౌంటర్‌లో ఉచితంగా పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులతో పాటు తెల్లరేషన్ కార్డు జిరాక్స్ కాపీని జత చేసి 25వ తేదీ సాయంత్రం 4 గంటల లోపుగా అందజేయాలి. సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే భక్తులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని దేవస్థానం సూచించింది.
పవిత్రోత్సవాల సందర్భంగా దర్శన వేళల్లో మార్పు…
దుర్గ గుడిలో ఈ నెల 21వ తేదీ నుంచి పవిత్రోత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శన వేళల్లో మార్పు చేశారు. 21 నుంచి పవిత్రోత్సవాలు ముగిసే 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే, ఆ మూడు రోజులపాటు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.