-పోలవరంకోసం త్యాగాలు చేసిన గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది…
-ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలుపై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రి గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల విజ్ఞాపణలు
స్వీకరించాం…
-జాతీయ యప్ కమిషన్ సభ్యులు అనంతనాయక్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాల చేసిన గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని జాతీయ యటి కమిషన్ సభ్యులు అనంతనాయక్ అన్నారు. విజయవాడ గేట్ హోటల్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులకు అందిస్తున్న ఆర్ఎంస్ఆర్ ప్యాకేజ్ అమలుపై నాయక్ వివరించారు. ఈసందర్భంగా అనంతనాయక్ మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పోలవరం నిర్వాసిత ప్రాంతాలలో మూడు రోజులు పాటు పర్యటించి స్వయంగా నిర్వాసిత గిరిజనులను కలిసి వారితో మాట్లాడడం జరిగిందని ఆయన అన్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో వివిధ సమస్యలపై గిరిజనులు కమిషను 203 ఫిర్యాదులు అందించారని వాటిని పరిశీలించి వాటిని పరిష్కరిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులకు పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారని ఈకాలనీల్లో నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాల పెంచాలని ఆయన అన్నారు. పట్టణీకరణ స్థాయిలో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారని ఇటువంటి కాలనీల్లో గిరిజనులు నివాసం ఉండడానికి మక్కువ చూపరని ఆయన అన్నారు. గిరిజనులకు కేటాయించిన భూముల్లో వారు మాత్రమే సాగు చేసుకునేలా అధికారయంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ఎంఆర్ ప్యాకేజీని నిర్వాసితులందరికీ లబ్ధి చేకూర్చేలా అమలు చేయాలన్నారు. గిరిజనులకు ప్రభుత్వం నుండి అందవలసిన ప్రతీ సహాయము అందాలని ఇందుకు వ్యక్తులుగానీ, వ్యవస్థలు గానీ అడ్డుతగలరాదని ఆయన అన్నారు. గిరిజనులకు న్యాయం చేయడానికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం నిర్వాసితులకు అవసరమైన ఆర్ఎంస్ఆర్ ప్యాకేజీ నిధుల విషయంలో కేంద్రప్రభుత్వంతో చర్చించి పూర్తి స్థాయిలో నిధుల విడుదలకు కృషి చేస్తానని నాయక్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పి.నారాయణపురం, మూలకోటి, పెదభీములపల్లి, రెడ్డిపాలెం, చింటూరు, మొదలగు గిరిజన గ్రామాలలో మూడురోజులుపాటు పర్యటించి వారి సమస్యలను విన్నామని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి 200 లకు పైగా గిరిజన ప్రజల నుండి అర్జీలు అందినవని నాయక్ అన్నారు. పునరావాసానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించామన్నారు. పరిశీలనలో క్రొత్తగా నిర్మించిన పునరావాస కాలనీల్లో ప్రాధమిక సౌకర్యాలు లేవని, డ్రెయినేజీ, శానిటేషన్, మరియు త్రాగునీటివంటి సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉందని నాయక్ అన్నారు. గిరిజనులు అటవీ హక్కులను కోల్పోయారని వారి సాంప్రదాయం సంస్కృతిని పరిరక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ పునరావాస కార్యక్రమాలను అమలు చేయాలని ఆయన అన్నారు. క్రొత్తగా నిర్మిస్తున్న పునరావాస కాలనీల్లో శ్మశానవాటిక, దేవాలయం, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాధమిక ఆరోగ్య సంరక్షణా కేంద్రం మొదలగు వాటిని నిర్మించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రతీ నిర్వాసిత కుటుంబాలకు వాగ్దానం చేయబడిన విధంగా పది లక్షల రూపాయలు పోలవరం ప్రాజెక్టు ద్వారా ప్రభావితమైన గిరిజన కుటుంబాలకు అందించాలని ఆయన అన్నారు. నిర్వాసితులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంస్థల ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి సౌకర్యాలు చేపట్టాలని గిరిజనులకు అవసరమైన కనీస అవసరాలతో వారి జీవన పరిస్థితులు మెరుగుపడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కాలనీల్లో ఉన్న పలు సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించి వారికి అవసరమైన పౌరసౌకర్యాలు కల్పించాలని జాతీయ యటి కమిషన్ సభ్యులు అనంతనాయక్ అన్నారు. ఈ పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరు పి.రంజిత్ భాషా, రీజనల్ హెడ్ ఆఫీస్ ఒరిస్సా కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టరు డా. అశోక్ వర్ధన్, ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ టిసిఆర్ అండ్ టియం మిషన్ డైరెక్టరు ఇ.రవీంద్రబాబు, జాతీయ యటి కమిషన్ లీగల్ అడ్వయిజర్ రాధాకాంత్ త్రిపాటి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News