-23 వ డివిజన్ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన…
-నక్కలరోడ్డులో అస్తవ్యస్థ డ్రైనేజీ వ్యవస్థపై సీరియస్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారంలో, క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 23 వ డివిజన్ నక్కలరోడ్డు ప్రధాన రహదారిలో డ్రైనేజీ వ్యవస్థపై ఫిర్యాదులు అందడంతో శాసనసభ్యులు స్థానికంగా పర్యటించారు. వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంచార్జ్ ఆత్మకూరు సుబ్బారావుతో కలిసి చిలుకు దుర్గయ్య వీధిలోని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. చుట్టుప్రక్కల హాస్టళ్ల నుంచి చెత్తను నేరుగా యూజీడీలో పడవేయడంతో ప్రధానంగా సమస్య తలెత్తుతోందని ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ పొంగి పొర్లుతూ ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతున్నా.. అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికే పరిస్థితి ఈవిధంగా ఉంటే.. భారీ వర్షాల సమయంలో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సమస్య తీవ్రతను గుర్తించి.. మురుగునీరు బయటకు వెళ్లేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సమస్య శాశ్వత పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళతామని మల్లాది విష్ణు హామీనిచ్చారు. వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ డివిజన్ కో ఆర్డినేటర్ ఒగ్గు విక్కీ, స్థానిక నాయకులు నాడార్స్ శ్రీను, వడ్డి వాసు, చల్లా సుధాకర్, శివారెడ్డి, అంజిబాబు తదితరులు ఉన్నారు.