-రెండు దశాబ్దాల్లో రుణాల మంజూరులో విప్లవాత్మక మార్పు – లక్ష రూపాయల నుండి 20 లక్షల వరకు
-మహిళలు ఆర్థిక శక్తితో పాటు సామాజిక బాధ్యత వహించాలని పిలుపు
-అబ్బాయిలకూ మహిళల భద్రతపై అవగాహన అవసరం అప్పుడే ఆడపిల్లలు సురక్షితం
-SHG బ్రాండ్‌తో టీ స్టాల్స్ – భవిష్యత్తులో ఫ్రూట్ స్టాల్స్ దిశగా అడుగులు
-ఎరువుల అధిక వినియోగం ఆరోగ్యంపై ప్రభావం – పరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకం తగ్గింపులో SHGs ముందుండాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం హుకుంపేటలోని జిల్లా సమాఖ్య కార్యాలయం లో 23వ జిల్లా సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా మెజిస్ట్రేట్ & కలెక్టర్ పి. ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాల్లో స్వయం సహాయక సంఘాల (SHGs) రుణాల మంజూరులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నా యన్నారు. లక్ష రూపాయల నుండి ప్రస్తుతం 20 లక్షల వరకు రుణాలు పొందడం ఒక సాధనమని పేర్కొన్నారు. చిన్న మొత్తాల రుణాలనుండి పెద్ద మొత్తాల రుణాలు దిశగా వచ్చిన ఈ మార్పు మహిళల ఆర్థిక సాధికారతకు దోహదం చేసిందన్నారు. రుణాలను ఆదాయ వనరుల మెరుగుదల కోసం వినియోగించుకోవడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని అభిప్రాయపడ్డారు.
మహిళలు ఆర్థిక సాధికారతతో పాటు సామాజిక బాధ్యత విషయంలో స్వయం సహాయక సంఘాల మహిళలు కీలక పాత్ర వహించాలని పిలుపు నిచ్చారు. ఎరువుల అధిక వినియోగం పంటలపై, భూసారంపై, ఆహారంపై ప్రభావం చూపుతోందని, ఈ విషయాన్ని గ్రామ స్థాయిలో అవగాహన కల్పించడం SHGs బాధ్యతగా గుర్తించాలన్నారు. త్వరగా అధిక దిగుబడి వస్తుందని ఆలోచన ధోరణి తో అవసరానికి మించి యూరియా వినియోగం చెయ్యడం జరుగుతోందని, అందువల్ల మనం తీసుకునే ఆహారం లో వాటి శేషాలు ఉండడం వలన తెలియ కుండానే మన ఆరోగ్యం పై వాటి ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అనారోగ్యం గురి కావడంతో డాక్టర్లు సూచించినట్లు మందులు వాడటం జరుగుతుందనీ, ఎడి విధంగా యూరియా ఎరువులు కూడా వాడాలని పేర్కొన్నారు. ఏదైనా మోతాదు కు మించి తీసుకుంటే లాభం కంటే అనర్ధం ఎక్కువ అని తెలియ చేశారు.
పరిశుభ్రత పాటించడానికి మన ఇంటి నుంచి అడుగులు వేయాలని కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, జూట్ బ్యాగులు, ప్రతి ఇంటికి డబుల్ డస్ట్‌బిన్ వినియోగం వంటి అంశాల పాటించడం, నలుగురికి అవగాహన కల్పించడం లో స్వయం సహాయక సంఘాల మహిళలు మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.
మహిళల భద్రత, రక్షణలో కుటుంబ సభ్యులందరూ బాధ్యత వహించాల్సిన అవసరాన్ని కలెక్టర్ నొక్కి చెప్పారు. “ఆడపిల్లలకు ఎప్పుడూ సూచనలు చేస్తాం కానీ అబ్బాయిలకు మాత్రం చెబుదాం అనే భావన ఉండడం లేదన్నారు. మగ పిల్లలకు కూడా మహిళల పట్ల గౌరవం, భద్రత కలిగించే విధంగా అవగాహన కల్పించాలి. అప్పుడే మన ఆడపిల్లలు సురక్షితంగా ఉంటారు, అనుకున్న లక్ష్యాల్ని చేరుకోగలుగుతారని ” స్పష్టం చేశారు.
అలాగే తూర్పు గోదావరి జిల్లాలో SHG మహిళలతో ” ఎస్ హెచ్ జీ – టీ స్టాల్స్” ఏర్పాటు చేసే దిశగా ప్రత్యేక బ్రాండింగ్, ప్రత్యేక బోర్డ్ డిజైన్ అందించే బాధ్యత జిల్లా యంత్రాంగం వహిస్తుందని కలెక్టర్ వెల్లడించారు. భవిష్యత్తులో SHG ఆధ్వర్యంలో ఫ్రూట్ స్టాల్స్ తదితర వ్యాపార సముదాయాల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని సూచించారు. నాణ్యత, ప్రమాణం విషయంలో ప్రత్యేకత చూపడం ద్వారా మంచి డిమాండ్ ఉంటుందని, అన్ని చోట్ల ఒకే ధర అమలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందని తెలిపారు.
జిల్లా సమాఖ్య సమావేశంలో సభ్యుల ఆరోగ్యం, పిల్లల విద్య, మహిళల ప్రతిభ ప్రోత్సాహం, ప్రభుత్వ టెండర్లలో పాల్గొనగల స్థాయికి ఎదగడం, స్వయం మార్కెటింగ్, శానిటేషన్ పై శ్రద్ధ, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సక్రమ నిర్వాహణ, ప్లాస్టిక్ వాడకం మానుకోవడం, ఖాళీ స్థలాల్లో కూరగాయల సాగు, లింగ వివక్ష తగ్గించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మహిళ భద్రతా కార్యక్రమాలు, బాల్య వివాహ నిర్మూలన, 100% పారిశుద్యం కలిగిన గ్రామాలను రూపకల్పన చేయడం వంటి అంశాలపై చర్చించడం జరిగిందనీ పిడి మూర్తి తెలియ చేశారు.
ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి, జిల్లా పశు సంవర్ధక అధికారి కె. శ్రీనివాస్ రావు, ఎపిడి వై. సత్యం నాయుడు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కందికట్ల అరుణ కుమారి, కార్యదర్శి డొక్కు లక్ష్మి పార్వతి, కోశాధికారి షేక్ ఫాతిమా, డిపిఎం లు సంపత్ కుమార్, జనార్ధన్, శ్రీనివాస్, రాజారావు, SHG సభ్యులు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు, సహాయ ప్రాజెక్ట్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
———————-
సహాయ సంచాలకులు, రాష్ట్ర సమాచార కేంద్రం, రాజమహేంద్రవరం వారిచే జారీ.
Prajavartha Online Telugu News