-భవానీల రాకతో కొండపై పెరిగిన రద్దీ…
-పకడ్బందీ ఏర్పాట్లతో అందరికీ సంతృప్తికర దర్శనం
-అధికార యంత్రాంగంపై భక్తుల ప్రశంసల వర్షం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ భక్తులకు తోడుగా… భవాని మాలధారుల రాకతో ఇంద్రకీలాద్రి పర్వతం జై భవాని నినాదాలతో మార్మోగుతోంది. రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచే అధికార యంత్రాంగం ఒక నిర్ణీత పద్ధతిలో ఎక్కడా భక్తుల రద్దీ కారణంగా ట్రాఫిక్
అవరోధాలు ఎదురుకాకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, నగర పాలక సంస్థ కమిషనర్
ధ్యానచంద్ర, నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శీనానాయక్ లు ఇస్తున్న ఆదేశాలతో చక్కని సమన్వయంతో భక్తులకు అవసరమైన ప్రాథమిక అవసరాలను తీర్చేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశము కల్పించడంతో మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. అమ్మ దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తునికి సంతృప్తికర దర్శన భాగ్యం లభిస్తోంది. అధికార యంత్రాంగం నవరాత్రి ఉత్సవాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న వివిధ శాఖలకు చెందిన ఇతర ప్రాంతాల అధికారులకు సైతం ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తోంది. సాధారణ భక్తుల సంతృప్తికర దర్శనమే లక్ష్యంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. భక్తులకు సురక్షిత తాగునీరు, బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ, చిన్నారులకు వేడిపాలు, అత్యవసర వైద్య సదుపాయం వంటి ప్రాథమిక సదుపాయాల కల్పనలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. భవానీల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎంతో భక్తితో మాలధారణ చేపట్టిన భవానీలు మాలధారణ విరమణ సమయంలో ఎక్కడా అసంతృప్తి తలెత్తకుండా అమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రి పర్వతానికి వచ్చిన ప్రతీ ఒక్కరు భక్తి భావంతో దర్శించుకునేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆధ్యాత్మిక అలౌకిక ఆనందానుభూతులతో దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా వివిధ శాఖలు తీసుకుంటున్న చర్యలతో భక్తులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Prajavartha Online Telugu News