Breaking News

డిస్కంలు, వినియోగదారుల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి ఏపీఈఆర్సీ కృషి…

-విద్యుత్తు రంగం బలోపేతం, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ.. ఈ రెండే ఏపీఈఆర్సీ ప్రధాన లక్ష్యాలు — ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి
-భవిష్యత్ లక్ష్యాలను చేరుకునేందుకు డిస్కంలు, ఏపీఈఆర్సీ తో సమన్వయముతో పనిచేయాలి
-విద్యుత్తు రంగం వృద్ధిలో ఏపీని అగ్రపథంలో నిలపాలి
-రాష్ట్రంలోని 1.86 కోట్ల వినియోగదారుల్లో 40 లక్షల మందికి ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీ తో లబ్ధి
-డిస్కంల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యానే 2015 నుంచి 2019 వరకు ఉన్న సర్దుబాటు ఛార్జీలు రూ.3669 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి
-విద్యుత్తు సంస్థలు ఇబ్బందుల్లో ఉండడం రాష్ట్రానికి మరియు వినియోగదారులకి మంచిది కాదు: ఏపీఈఆర్సీ
-ఏ నిర్ణయం తీసుకున్నా వినియోగదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారులు.. విద్యుత్తు సంస్థలు.. రాష్ట్ర విద్యుత్తు రంగానికి కీలకం. వినియోగదారులతో పాటు విద్యుత్తు సంస్థల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పనిచేస్తోంది. విద్యుత్తు రంగంలో వినియోగదారుల ఆధారిత విధానాన్ని అభివృద్ధి చేయడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, నాణ్యమైన, నిరంతరాయ కరెంటును సరఫరా చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. డిస్కంలను బలోపేతం చేయడంతో పాటు వాటి పనితీరును మెరుగుపర్చి వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడమే లక్ష్యంగా ఏపీఈఆర్సీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్తగా నియమితులైన సభ్యులతో రాష్ట్ర సలహా మండలి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ నెల 20న (సోమవారం) స్టేట్ ఎడ్వైసరి కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఏపీఈఆర్సీ సీనియర్ అధికారి తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఒక యూనిట్ విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే సగటు ఖర్చు తగ్గించడం, విద్యుత్తు కొనుగోళ్లను క్రమబద్ధీకరించడం, డిస్కంల పనితీరును మెరుగుపర్చడం, డిమాండ్ నిర్వహణ- ఇంధన సంరక్షణ- సామర్థ్యానికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడంపై చర్చించనున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో నాణ్యమైన, నిరంతర విద్యుత్తును అందుబాటు ధరల్లోనే సరఫరా చేస్తే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని ఫలితంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు. భవిష్యత్తు లక్ష్యాలు, సవాళ్లను సమర్థంగా అధిగమించేందుకు విద్యుత్తు సంస్థలు ఏ పీ ఈ ఆర్ సి తో కలిసి పనిచేయాలని సూచించారు. ఏపీఈఆర్సీ ఏ నిర్ణయం తీసుకున్నా వినియోగదారుల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటుందన్నారు.
‘‘వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, విద్యుత్తు సంస్థలను బలోపేతం చేయడం.. ఏపీఈఆర్సీకి ఈ రెండూ ప్రధాన లక్ష్యాలు. వీటిని పరిగణనలోకి తీసుకునే ఏపీఈఆర్సీ ప్రతి నిర్ణయం తీసుకుంటుంది. దేశంలో విద్యుత్తు రంగం పరివర్తన దశలో ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యుత్తు సంస్థలు ఏపీని ముందువరుసలో నిలపాలని ఏపీఈఆర్సీ కోరుకుంటోంది’’ అని చెప్పారు.
ఏపీఈఆర్సీ ఎప్పుడూ వినియోగదారులు, విద్యుత్తు సంస్థల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికే ప్రయత్నిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో డిస్కంల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 2015 నుంచి 2019 మధ్య కాలానికి గాను సర్దుబాటు ఛార్జీ (ట్రూ అప్)లను రూ.3669 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. డిస్కంలు ఆర్థికంగా సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడం రాష్ట్రానికి, అదే విధంగా వినియోగదారులకు మంచిది కాదని పేర్కొన్నారు.
వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన సర్దుబాటు ఛార్జీల్లో మూడో వంతును రాష్ట్ర ప్రభుత్వమే (రైతులు, ఎస్సీ, ఎస్టీలు, ఎంబీసీలు తదితరుల తరఫున) భరించవలసివస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 1.86 కోట్ల వినియోగదారుల్లో దాదాపు 40 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీతో లబ్ధి పొందుతారు .
రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వివిధ వర్గాల వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన 1657 కోట్ల రూపాయలను సెక్షన్ 65 ప్రకారం ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వుల ద్వారా అర్హులైన లబ్దిదారులకు (23 లక్షలు) రాయితీలు అందించడానికి ఏపీఈఆర్సీ 21-22 టారిఫ్ ఆర్డర్ లో తొలిసారిగా అనుమతి ఇచ్చింది. దీని వల్ల లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్కాముల నుంచి విద్యుత్ సబ్సిడీ పొందుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి సంబంధించి మాకు అత్యంత ప్రాధాన్యమైన అంశం.. విద్యుత్ రంగంలో సగటు వినియోగదారునికి అత్యంత నాణ్యమైన నమ్మకమైన , మెరుగైన కరెంటు సరఫరా (24x 7) అందించడం తో పాటు అనేక అంశాలలో వినియోగదారుని శ్రేయస్సు /అభివృద్ధి మాకు అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఇది సాధించాలంటే డిస్కాములు ఆర్థికంగా బలహీన పడవద్దు. డిస్కాములకు ఆర్థిక సామర్థ్యం , సుస్థిరత అత్యవసరం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ పీ ఈ ఆర్ ఈ సర్దుబాటు (ట్రూ అప్ ) చార్జీల వసూలు చేసుకోవటానికి డిస్కాములకు అనుమతినిచ్చిందని , ఏ పీ ఈ ఆర్ సి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు
వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపర్చేందుకు గాను ఏపీఈఆర్సీ పౌరసేవల ప్రమాణాలు (ఎస్వోపీ)(SOP) ను సవరించింది. దీనివల్ల కొన్ని సేవల వైఫల్యం గురించి వినియోగదారులు ఫిర్యాదుల మేరకు డిస్కంలు ఆటోమేటిక్ గా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
విద్యుత్తు రంగం బలోపేతం కోసం, వినియోగదారులకు అంతరాయాల్లేకుండా కరెంటును సరఫరా చేసేందుకోసం డిస్కంలు, ఏపీ ట్రాన్స్ కో సమర్పించిన పలు పెట్టుబడి ప్రతిపాదనలకు కమిషన్ పరిశీలించి ఆమోదం తెలుపుతుంది .
ఇంధన పొదుపు, సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఏపీఈఆర్సీ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. ఇంధన సంరక్షణలో ఏపీ ఉత్తమ స్థానంలో నిలవడంలో కమిషన్ విలువైన భాగస్వామిగా ఉంటోంది.
ఈ సమావేశంలో ఏపీఈఆర్సి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి  అధ్యక్షత వహిస్తారు. ఏ పీ ఈ ఆర్ సి సభ్యులు పీ రాజగోపాల్ రెడ్డి, ఠాకూర్ రామ్ సింగ్, విద్యుత్ సంస్థల సీఎండీ లు, స్టేట్ ఎడ్వైసరి కమిటీ సీనియర్ అధికారులు తదితరులు పాల్గొంటారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *