-కూటమి ప్రభుత్వం మీతోనే ఉంది
తెనాలి(గుంటూరు జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫాను దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం తెనాలిలో ప్రారంభించారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీలోను, తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో తుఫాన్ దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్పిన వెంటనే పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో 153 పునరావాస కేంద్రాల్లో 4,553 కుటుంబాలకు చెందిన 9,451 మంది ప్రజలకు పునరావాసం కల్పించారు. రేషన్ కిట్లలో 25 కిలోల బియ్యం, ఒక కిలో చొప్పున పంచదార, కంది పప్పు, బంగాళ దుంపలు, ఉల్లిపాయలు, పామాయిల్ ఉన్నాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తుఫాను హెచ్చరికలు అందిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని చెప్పారు. విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కోవడం జరిగిందని పేర్కొన్నారు. అధికారులు అందరూ క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షణ చేశారని అభినందించారు. విపత్తుల సమయంలో పునరావాస కేంద్రాలలో మంచి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ప్రభుత్వం ఇస్తున్న సమాచారం పట్ల విశ్వాసం కలిగి ఉండాలని చెప్పారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం అందించే సూచనలు, సలహాలు పాటించి, సహకరించాలని సూచించారు. సమాజంలో మార్పు ప్రజలతోనే రావాలని అన్నారు. ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకువస్తున్నాయని తెలిపారు. మెరుగైన సేవలు అందించుటకు అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని అన్నారు. ప్రతి నెల 26న రేషన్ ను అందిస్తున్నామని పేర్కొన్నారు. తక్కువ ధరకే అన్ని నిత్యావసర సరుకులు అందించుటకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 29,700 మంది డీలర్లు ఉన్నారని తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు అందించడం జరుగుతుందని, ప్రతి నెల రూ.2,700 కోట్లు పింఛన్లుగా పంపిణీ జరుగుతోందని వివరించారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి చెప్పారు. సహాయం అవసరం అనుకుంటే అందిస్తామని అన్నారు. దివ్యాంగులకు రేషన్ అందించుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తెనాలిలో రెండు పూటల తాగు నీరు అందించుటకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో మురుగు నీటి కాలువల పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం మీతోనే ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే తుఫానుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయిందన్నారు. జిల్లా యంత్రాంగం సమష్టిగా, సమర్థవంతంగా పనిచేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. తుఫాను అనంతర చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలో రేషన్ కిట్లతోపాటు కుటుంబానికి గరిష్టంగా 3 వేల రూపాయలు నగదు పంపిణీ పారదర్శకంగా చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి ఆరోగ్య సర్వే చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, తెనాలి పురపాలక సంఘం చైర్ పర్సన్ రాధిక, కమీషనర్ జె. రామ అప్పల నాయుడు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె. తులసి, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News