-ఈయాప్ తో ఆన్లైన్ ద్వారా నూరుశాతం ఇంటి పన్ను వసూలుకు అవకాశం
-ఇంటిపన్ను చెల్లించిన వెంటనే రశీదు లబ్దిదారుకు వెళుతుంది
-ఈవిధానంతో గ్రామ పంచాయితీల ఆర్ధిక పరిపుష్టికి అవకాశం
-ఇప్పటికే సుమారు 86లక్షల ఇళ్ళ ఇంటిపన్ను డేటా సిద్దం
-ఇకపై మాన్యువల్ విధానంలో ఇంటిపన్ను చెల్లింపు ఉండదు
-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇకపై గ్రామ పంచాయితీలన్నిటిలో ఇంటిపన్ను వసూలును ఆన్లైన్ విధానంలో వసూలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి మరియు భుగర్భ గనుల శాఖకు సంబంధించిన పలు అంశాలపై ఆయా విభాగాల అధికారులతో మంత్రి సమీక్షించారు. తొలుత ఆయన గనులు భూగర్భ శాఖకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా గ్రామ పంచాయితీల్లో ఇంటి పన్ను వసూలుకు సంబంధించి రూపొందించిన మొబైల్ యాప్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈమొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పారదర్శకంగా నూరు శాతం ఇంటిపన్ను వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోని గ్రామ పంచాయితీల్లో సుమారు 86 లక్షల గృహాలకు సంబంధించిన డేటాను సిద్దం చేసినట్టు మంత్రి తెలిపారు. ఇకపై మన్యూవల్ గా ఇంటిపన్నువసూలుకు స్వస్తి పలకడం జరుగుతుందని అన్నారు. బిల్లు కలెక్టర్ కు ఓటిపి బేస్డ్ అధంటికేషన్ తో ఇంటి పన్ను వసూలుకు అవకాశం అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక ఆన్లైన్ పేమెంట్ గేట్ వే గా ఈయాప్ ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.ఇంటి పన్ను చెల్లించిన వెంటనే ఆన్లైన్ ద్వారా రశీదు జనరేట్ అయి పన్ను చెల్లించిన వారికి వెళుతుందని చెప్పారు. అంతేగాక ఇంటిపన్ను చెల్లించాల్సిన వారు ఎంత పన్ను చెల్లించారు ఇంకా ఎంత చెల్లించాల్సి ఉందనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా ఆయా పంచాయతీలోని పన్నుచెల్లింపు దారుకు సంక్షిప్త సమాచారం వెళుతుందని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక మాన్యువల్ విధానంలో ఇంటి పన్ను చెల్లింపు ఉండదని అన్నారు.
Prajavartha Online Telugu News