-ఎనిమిది నియోజకవర్గాల్లో శాసన సభ్యులచే ప్రారంభం – దివ్యాంగులతో సహా పంక్తి భోజనం
-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగశక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మార్చి 18న బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో దివ్యాంగశక్తి పథకం పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించనున్నారని వెల్లడించారు. అదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలోని ఎనిమిది నియోజక వర్గాల్లో స్థానిక శాసన సభ్యులు సూచించిన ప్రదేశాల నుంచి బస్సులు ప్రారంభమై దివ్యాంగులతో ప్రయాణం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గంలో 60 నుంచి 80 మంది దివ్యాంగులను గుర్తించి రెండు విడతలుగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. బస్సు ప్రయాణం పూర్తి చేసిన తరువాత దివ్యాంగులకు తగిన భోజన సదుపాయం కల్పించాలన్నారు. అదేవిధంగా మరో బృందంలోని దివ్యాంగులతో స్థానిక శాసన సభ్యులు వారి నివాస ప్రాంతాల్లో లేదా సూచించిన ప్రదేశాల్లో సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొననున్నారని కలెక్టర్ తెలిపారు. ఇందుకు నియోజక వర్గం ప్రత్యేక అధికారులు శాసన సభ్యులు తో కార్యక్రమం యొక్క పూర్తి వివరాలు తెలియ చెయ్యాలని ఆదేశించారు.
దివ్యాంగశక్తి ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో కూడా దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా దివ్యాంగులను గుర్తించి జాబితాలు సిద్ధం చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు, డీఆర్‌డిఏ మరియు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి శాసన సభ్యులు సూచించిన మేరకు అవసరమైన బస్సులను ఆయా ప్రాంతాల్లో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో వికలాంగుల సంక్షేమ శాఖ, ఆర్టీసీ, డీఆర్‌డిఏ, మెప్మా, మున్సిపల్, మండల అభివృద్ధి, పోలీసు, విద్యా మరియు సమాచార శాఖల అధికారులు పాల్గొని కార్యక్రమం విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు.
Prajavartha Online Telugu News