-జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. ఎం. వసుంధర
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్షయ రోగుల సంఖ్య తగ్గిందని, వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు వార్డు, గ్రామ, పట్టణ ప్రాంతాలు మరియు విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారిణి డా. ఎం. వసుంధర పేర్కొన్నారు.
మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులకు టిబి నివారణపై పోస్టర్ ప్రదర్శన మరియు రంగవల్లి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ వసుంధర మాట్లాడుతూ క్షయ వ్యాధి నియంత్రణ కోసం జిల్లాలో 54 మైక్రోస్కోప్ కేంద్రాలు, 25 అధునాతన వ్యాధి నిర్ధారణ NAAT యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్షయ రోగుల కుటుంబ సభ్యులకు వ్యాధి సోకకుండా TPT (ముందస్తు జాగ్రత్త మందులు) అందిస్తున్నామని తెలిపారు. టిబి అనుమానితులకు అత్యాధునిక సాంకేతిక ల్యాబ్ యంత్రాలు మరియు పోర్టబుల్ ఎక్స్-రే యంత్రాల ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్షయ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
క్షయ బాధితులకు అదనపు పోషకాహారం అందించేందుకు కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ‘నిక్షయ్ మిత్ర’లుగా ముందుకు రావాలని ఆమె కోరారు. అనంతరం పోటీలను ముఖ్య అతిథులు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర ఆర్‌కే, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి డా. శ్రీదేవి, రెడ్ క్రాస్ కన్వీనర్ రవితేజ, డీఎన్‌ఎంఓ డా. హారిక, ఎంఓడిటిసి డా. సౌమ్య తదితరులు పాల్గొని ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు విద్యార్థులను ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో డీపీఎస్ లక్ష్మి సుందరి, ఆర్ట్స్ కళాశాల, సాయి నర్సింగ్, ప్రియదర్శిని నర్సింగ్ కళాశాలల విద్యార్థులు, ఎన్‌టీఈపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News