Breaking News

ధరలు పెరుగుతాయనే ఆందోళన వద్దు…

-అనవసర కొనుగోళ్లతోనే ఇబ్బందులు…
-ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి…
-ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇంజనం ధరల్లో విపరీతమైన మార్పులు వస్తాయని సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారం కారణంగా వాహనదారులు ఆందోళనతో చేస్తున్న అనవసర కొనుగోళ్లతోనే ప్రస్తుతం ఇంధన ఇబ్బందులు ఎదురయ్యాయని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా అన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె జిల్లాలోని ఇంధన పరిస్థితిపై వివరించారు.
జిల్లాలో ప్రస్తుతం మొత్తం 186 పెట్రోల్ బంకుల ద్వారా పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని, ఎటువంటి కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 20 శాతం అదనంగా ఇంధన సరఫరా జరుగుతోందని తెలిపారు. కొండపల్లి ప్రాంతంలోని సరఫరా సంస్థలతో ఇప్పటికే చర్చలు జరిపి, జిల్లాకు అవసరమైన మేరకు ఇంధనాన్ని నిరంతరం అందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని, కొరత ఏర్పడుతుందనే అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, ప్రజలు ఇటువంటి వదంతులను నమ్మవద్దని ఆమె స్పష్టంగా సూచించారు. కేంద్ర పెట్రోలియం శాఖ కూడా ధరల పెరుగుదలపై వస్తున్న ప్రచారాలను ఖండించిందని తెలిపారు.
ఇటీవలి రోజుల్లో ప్రజలు అవసరానికి మించిన స్థాయిలో ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్ల ఒక్కసారిగా 30 నుంచి 50 శాతం వరకు డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. అందరూ ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల కొంతమంది బంకుల్లో తాత్కాలికంగా “నో స్టాక్” బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అయితే ఇది సరఫరా లోపం వల్ల కాకుండా ప్రజల ఆందోళన కారణంగా మాత్రమే ఏర్పడిన తాత్కాలిక సమస్య అని స్పష్టం చేశారు.
ప్రతి పెట్రోల్ బంక్ వద్ద క్రమబద్ధంగా సరఫరా జరిగేలా క్యూలైన్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. బంకుల వద్ద పోలీస్ మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి, జిల్లాలోని అన్ని బంకుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు.
వ్యవసాయం, ఆక్వా రంగం, ఆస్పత్రులు మరియు అంబులెన్స్ అవసరాలను ప్రధాన ప్రాధాన్యతగా గుర్తించి డీజిల్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కమర్షియల్ డీజిల్ వినియోగదారులు కూడా రిటైల్ బంకుల వైపు రావడం వల్ల కొంతమేర డిమాండ్ పెరిగిందని చెప్పారు.
ప్రైవేట్ పెట్రోల్ బంకుల్లో కొంతమేర అధిక ధరలు వసూలు చేస్తున్న అంశాన్ని గమనించామని, దీనిపై సంబంధిత అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బంకు యజమానులు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేస్తున్నారని, ఆయిల్ కంపెనీలు కూడా అదనపు సరఫరా అందిస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సరఫరా సమృద్ధిగా ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
మరో ఒకటి లేదా రెండు రోజుల్లో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు పానిక్‌కు గురికాకుండా, అవసరానికి తగినంత మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరూ ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల తాత్కాలిక ఇబ్బందులు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.
జిల్లాలో ఎటువంటి సమస్యలు తలెత్తిన పక్షంలో ప్రజలు జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454 ను సంప్రదించవచ్చని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *