మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 10 వ (ఎస్ ఎస్ సి) తరగతిలో ఆనుత్తీర్ణులైన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉన్నతాధికారులకు తెలిపారు. శనివారం సాయంత్రం రాష్ట్ర పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి మాట్లాడుతూ జిల్లాలో 21,053 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా వారిలో 18,540 మంది ఉత్తీర్ణులయ్యారని, 2513 మంది అనుతిర్ణులయ్యారన్నారు
అనుత్తీర్ణులైన విద్యార్థులు బడి మానేయకుండా వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఆ విద్యార్థులకు సబ్జెక్టు ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉపవిద్యాధికారులతో సమన్వయం చేసుకుని ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నామన్నారు. అలాగే ప్రస్తుతం పదవ తరగతిలోకి ప్రవేశించిన విద్యార్థుల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేకించి బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తున్నామని , వారి విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో గత సంవత్సరం కంటే 10 శాతం ఎక్కువగా బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో చేరే విధంగా(ఎన్రోల్మెంట్ ) కృషి చేస్తామన్నారు.
ముఖ్యంగా అంగన్వాడీలోనీ పిల్లల తల్లిదండ్రులకు సాధ్యమైనంతవరకు ప్రవేట్ పాఠశాలల్లో ఉన్న వసతులు ఉపాధ్యాయుల విద్యా ప్రమాణాలు తెలియజేసి చైతన్యపరిచి వారి పిల్లలు ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో చేర్చే ప్రయత్నం చేస్తామన్నారు. ముఖ్యంగా దుర్బల పరిస్థితిలో ఉన్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి సారించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అన్ని విధాల చొరవ తీసుకుంటామన్నారు. ప్రభుత్వ మునిసిపల్ పాఠశాలల్లో పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన మొదటి ముగ్గురిని షైనింగ్ స్టార్స్ లో భాగంగా అభినందించే కార్యక్రమం చేపడతామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాధికారి యు వి సుబ్బారావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News