– మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘స్ర్తీ పునరుత్పత్తి హక్కులు’ పై వెబినార్
– చట్టాల అమలుతో స్త్రీ స్వేచ్ఛ సాధ్యం
– కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల ఆరోగ్య ప్రాముఖ్యతను తెలియజెప్పే లైంగిక, పునరుత్పత్తి హక్కులను కాపాడటం సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ తో పాటు తెనాలి జేఎంజే కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం’స్ర్తీ పునరుత్పత్తి హక్కులు’ అంశంపై మేధావులతో వెబినార్ సమావేశం నిర్వహించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ పి.హేమలత అధ్యక్షతన నిర్వహించిన సెమినార్ లో వాసిరెడ్డి పద్మ ప్రసంగిస్తూ మహిళలకు ఆరోగ్య విద్య అవసరమని, మైనార్టీ తీరిన తర్వానే వివాహం చేసుకోవడం, ఇష్టపూర్వకంగా గర్భం ధరించడం వంటి హక్కులను అందరూ గుర్తించాలన్నారు.మహిళల ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే దంపతులకు ఆరోగ్యకరమైన శిశువు పుడతాడనే సత్యాన్ని గుర్తించాలన్నారు. గర్భిణుల పోషకాహారం నుంచి ప్రసవం వరకు చట్టాలు హక్కులను నిర్దేశించాయన్నారు. గర్భిణీ అనుమతి లేకుండా వైద్య విధానాలను చేపట్టడం కూడా నేరమేనన్నారు. పిల్లలతో తల్లి సంబంధాన్ని నిరోధించడం, నవజాత శిశువుకు పాలిచ్చే హక్కును కాపాడుకోవడం తదితర అంశాలపై అవగాహన అవసరమన్నారు. వెబినార్ లో తెనాలి జేఎంజె కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఆర్ షైనీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (హైదరాబాద్, తెలంగాణ) ప్రొఫెసర్ డాక్టర్ కె. రవి రజిత మాధురి, ఏఎన్ యూ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ విమల, తెనాలి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కె.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.