-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆకాంక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ బుధవారం పారిశుధ్య సంబందిత ప్రజారోగ్య మరియు ఇంజనీరింగ్ విభాగముల క్షేత్ర స్థాయి అధికారులు మరియు సిబ్బందితో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కొరకు తీసుకొనవలసిన చర్యలపై సమీక్షించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 లో మూడవ స్థానం సాధించుటకు శ్రమించిన పారిశుధ్య కార్మికుల నుండి పై స్థాయి అధికారుల యొక్క కృషిని అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 నందు మొదటి స్థానం సాధించే దిశగా ఇప్పటి నుండే ప్రణాళికాబద్దంగా పారిశుధ్య నిర్వహణ చేపట్టవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. ప్రధానంగా పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ యూరినల్స్ నిర్వహణ అత్యంత సమర్ధవంతంగా ఉండవలెనని, సదరు టాయిలెట్స్ వద్ద విధిగా ఫీడ్ బ్యాక్ చార్ట్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ అధికారులు సంతకం చేయాలని ఆదేశించారు. మూడు కాలువలు మరియు కాలవగట్లు ఎల్లప్పుడూ చెత్త రహితంగా పరిశుభ్రంగా ఉండునట్లుగా చూడవలెనని, ఇందు కొరకు అవసరమగు సిబ్బంది వివరములతో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గృహములు, వ్యాపార, వాణిజ్య సముదాయాల వారు విధిగా చెత్తను విభజించి పారిశుధ్య సిబ్బందికి అందించునట్లుగా పర్యవేక్షణ జరుపవలెనని ఆదేశించారు. నగరంలో పారిశుధ్య పరిస్టితులను మెరుగుపరచుటకు టెక్నాలజీ వినియోగంతో సత్వరమే పారిశుధ్య సమస్యలను పరిష్కరించుటలో సంబందిత విభాగములతో సమన్వయము చేసుకుంటూ సూక్ష్మస్థాయి ప్రణాళికలతో అలసత్వం లేకుండా చేపట్ట బడిన ప్రతి కార్యక్రమము నిరంతరం కొనసాగునట్లుగా చూడాలని అన్నారు. రాబోవు స్వచ్చ్ సర్వేక్షణ్ లో మొదటి స్థానం సాదించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆకాంక్షించారు. సమావేశంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, ఎస్.ఇ (ప్రాజెక్ట్స్) పి.వి.కె భాస్కర్ రావు, హెల్త్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, శానిటరీ సూపర్ వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.