– క్రాఫ్ట్స్ కౌన్సిల్ సేవలు అభినందనీయం
– సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణకు కృషి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర చేనేత, హస్తకళల వైభవాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు నేత కార్మికులు, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
విజయవాడలోని పీవీపీ స్క్వేర్ మాల్‌లో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సీసీఏపీ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేనేత బజారును గురువారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. ఆయన సతీమణితో పాటు సీసీఏపీ కార్యదర్శి ఎస్.రంజన, వైస్ ఛైర్‌పర్సన్ బి.సుజాత తదితరులతో కలిసి ప్రారంభించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ బజారు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత, హస్తకళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ముఖ్యంగా యువతలో చేనేత, హస్తకళలపై అవగాహన పెంచి, మన సంప్రదాయ కళలను భావితరాలకు అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. చేతివృత్తులు, చేనేత వస్త్రాల సుస్థిర అభివృద్ధి కోసం ఎలాంటి లాభాపేక్షా లేకుండా క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషిచేస్తోందన్నారు. చేనేత కార్మికులు, హస్తకళాకారుల సంక్షేమం, డిజైన్ అభివృద్ధి, శిక్షణ, మార్కెటింగ్ తదితరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
వెంకటగిరి, పొందూరు, పెడన తదితర ప్రాంతాల చేనేత వస్త్రాలతో పాటు సంప్రదాయ కళాకృతులను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చేనేత, హస్తకళల పరిరక్షణ, ప్రోత్సాహానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలో విజయవాడలో జాతీయ సరస్ అజీవిక మేళా జరగనుందని వెల్లడించారు. కొండపల్లి, ఏటికొప్పాక వంటి అపురూప కళా సంపద పరిరక్షణకూ విశేష కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు చేనేత బజారును సందర్శించి చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా నేత కార్మికులు, కళాకారులకు చేయూతనివ్వాలని కోరారు. కార్యక్రమంలో సీసీఏపీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News