– జిల్లాలో 2,23,883 మంది లబ్ధిదారులకు రూ. 86.59 కోట్లు
– పెన్షన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు అనుగుణంగా పేదలకు సామాజిక భద్రత కల్పించేందుకు, పేదరిక నిర్మూలనకు ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల ఫలాలను అర్హుల ఇంటివద్దకే అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
గురువారం విజయవాడ అర్బన్, మధురానగర్ లో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న వారు వాటిని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. జిల్లాలో 2,23,883 మంది లబ్ధిదారులకు రూ. 86.59 కోట్లు మేర పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, ఇతర లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఇంటిదగ్గరే పెన్షన్లు అందిస్తున్నట్లు వివరించారు. పంపిణీ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News