– వారి అనుభవాలు భావితరాలకు బంగారు బాటలు
– వయోవృద్ధుల రక్షణ, గౌరవం, సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటోంది
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వయోవృద్ధులు సమాజానికి అమూల్య సంపద అని, వారి జీవిత అనుభవాలు భావితరాలకు ఎంతో విలువైన మార్గదర్శకాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. వయోవృద్ధులు ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని, వారి రక్షణకు చట్టపరమైన రక్షణలు ఉన్నాయని తెలిపారు.
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌టీఆర్ జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కార్యక్రమాన్ని గురువారం విజయవాడ బందర్ లాకులలోని స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. డీసీపీ కేజీవీ సరిత,
రెండో అదనపు జిల్లా జడ్జ్ ఎం.సునీల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వయోవృద్ధులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించాలని.. వారిపట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు. వయోవృద్ధుల పట్ల నిర్లక్ష్యం లేదా చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. వయోవృద్ధుల జీవితానుభవాలు కుటుంబానికి, నేటి తరానికి, సమాజానికి ఎంతో విలువైనవని పేర్కొన్నారు. డీసీపీ కేజీవీ సరిత మాట్లాడుతూ వయోవృద్ధులు భావితరాలకు మార్గదర్శకులని, వారి అనుభవాలు సమాజానికి ఎంతో విలువైనవని తెలిపారు. వయోవృద్ధుల భద్రత, గౌరవం, సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా 80 నుంచి 100 సంవత్సరాల వయసున్న పలువురు వయోవృద్ధులతో పాటు వృద్ధాశ్రమాల నిర్వాహకులను ఘనంగా సన్మానించారు. జిల్లా వయోవృద్ధుల సంఘాలు, వృద్ధాశ్రమాలకు చెందిన సుమారు 200 మంది వయోవృద్ధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని ఎన్‌టీఆర్ జిల్లా విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వాడ్రేవు కామరాజు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు వేమూరి బాబూరావు, కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News