విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో మౌలాలిలోని రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్) శిక్షణా కేంద్రంలో 2021 డిసెంబర్ 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు10వ అఖిల భారత ఆర్‌పీఎఫ్ బ్యాండ్ పోటీలను నిర్వహిస్తున్నారు. నిర్వాహకులైన దక్షిణ మధ్య రైల్వేతో సహా రైల్వే రక్షక ప్రత్యేక దళం (ఆర్‌పీఎస్‌ఎఫ్), మధ్య రైల్వే, తూర్పు రైల్వే, తూర్పు మధ్య రైల్వే, ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, ఈశాన్య రైల్వే, వాయువ్య రైల్వే, పశ్చిమ మధ్య రైల్వే, ఆగ్నేయ మధ్య రైల్వే, ఆగ్నేయ రైల్వే మొదలగు 12 ఆర్‌పీఎఫ్ బ్యాండ్ బృందాల నుండి మొత్తం180 బ్యాండ్ సిబ్బంది ఈ పోటీలలో పాల్గొంటున్నారు.
ఈ బ్యాండ్ పోటీలను నేడు అనగా 15 డిసెంబర్, 2021 తేదీన మౌలాలిలోని ఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రం ఐజీ-డైరెక్టర్ సంజయ్ సాంక్రీత్యయన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్, ఐజీ జి.ఎమ్.ఈశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్‌పీఎఫ్ అధికారులు మరియు సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి.ఎమ్.ఈశ్వర రావు ప్రసంగిస్తూ ఇటువంటి పోటీలు స్నేహపూర్వక వాతావరణాన్ని మరియు సోదరభావాన్ని కలిగిస్తాయని అన్నారు. ఇటువంటి సంప్రదాయ కార్యక్రమాల నిర్వహణలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ఆయన అన్నారు. సంజయ్ సాంక్రీత్యయన్ మాట్లాడుతూ పోటీలలో పాల్గొంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు మరియు క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనాలని సూచించారు.
పోటీలలో పాల్గొనే బృందాలను ముగ్గురు న్యాయ నిర్ణేతలచే క్విక్ మార్చ్, స్లో మార్చ్ & ఓవర్‌ట్యూర్ వంటి విభాగాలుగా ఎంపిక చేస్తారు. ఈ కార్యక్రమంలో బగ్లర్ పోటీ కూడా నిర్వహిస్తారు. వారి ప్రదర్శన మేరకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపిక చేస్తారు. అనంతరం, ఇందులో పాల్గొన్న 12 బృందాలలో ఉత్తమ ప్రదర్శన ప్రదర్శించిన సభ్యులను ఎంపిక చేసి అఖిల భారత ఆర్‌పీఎఫ్ బ్యాండ్ బృందాన్ని ఎంపిక చేస్తారు. ఎంపికైన ఈ బృందం 21వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలలో రైల్వే రక్షక దళం తరపున ప్రాతినిథ్యం వహిస్తారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …