-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాలవారికి మరింత లబ్దిచేకూర్చే విధంగా నూతన పథకాలను ప్రతిపాదించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎస్సీ కంపొనెంట్ ప్లాన్ అమలు తీరును సమీక్షించేందుకు గురువారం అమరావతి సచివాలయం 5 బ్లాక్ సమావేశ మందిరంలో మంత్రి అధ్యక్షతన రాష్ట్ర నోడల్ ఏజెన్సీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మూస పద్ధతిలో పాత పథకాలను మాత్రమే అమలు చేయడం కాకుండా ఎస్సీలకు మరింత లబ్ధి చేకూర్చే విధంగా వినూత్న పథకాలను ప్రతిపాదించాలని అధికారులకు సూచించారు. ఇందుకై జిల్లాల వారీగా ఉన్న స్థానిక ఎస్సీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలను నిర్వహించి వినూత్న పథకాలను ప్రతిపాదించాలన్నారు. షెడ్యూల్డు కులాలు మరియు ఇతర కులాల వారి అభివృద్దిలో ఉన్న అంతరాయాలను, వ్యత్యాసాలను సరిచేసే విధంగా నూతన పథకాలను రూపొందించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబోయే ఎస్సీ కంపొనెంట్ ప్లాన్లో ప్రతిపాదించాలని అన్ని శాఖల అధికారులను మంత్రి కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కంపొనెంట్ ప్లాన్ అమలు తీరును మంత్రి సమీక్షిస్తూ, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18,138.84 కోట్ల మేర నిధులను ఈ పథకం కింద కేటాయించగా ఇప్పటివరకు 68.42 శాతం అంటే రూ.12,409.87 కోట్లను మాత్రమే వెచ్చించడం జరిగిందని మంత్రి తెలిపారు. మరో మూడు మాసాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో మిగిలిన ఎస్సీ కంపొనెంట్ ప్లాన్ నిధులను కూడా సాధ్యమైనంత త్వరగా వెచ్చించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎస్సీ కంపొనెంట్ ప్లాన్ ను అమలు చేసే శాఖలు రాష్ట్రంలో 42 ఉన్నాయని, వాటిలో కేవలం 17 శాఖలు మాత్రమే 76 శాతం పై బడి నిధులను వెచ్చించాయని, మిగిలిన శాఖలు చాలా తక్కువ మొత్తంలో ఖర్చుచేశాయన్నారు. అయితే 5 శాఖలు ఎటు వంటి నిధులను ఎస్సీ కంపొనెంట్ ప్లాన్ క్రింద వెచ్చించకపోవడంపై మంత్రి అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఎస్సీ కంపొనెంట్ ప్లాన్ క్రింద కేటాయించిన నిధులను తప్పని సరిగా వెచ్చిస్తూ ఈ పథకాన్ని సమర్థవంతంగా అన్ని శాఖలు అమలు చేయాలని మంత్రి కోరారు. సుమారు 42 శాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఆయా శాఖల ద్వారా అమలు చేయబడుతున్న ఎస్సీ కంపొనెంట్ ప్లాన్ అమలు తీరును మంత్రికి వివరించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కె. సునీత, సంచాలకులు కె.హర్షవర్ధన్, స్వఛ్చాంధ్రా కార్పొరేషన్ ఎండి సంపత్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ అరుణ్ కుమార్, సర్వ శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వెట్రిసెల్వి తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.