Breaking News

పర్యావరణ హిత పుణ్యక్షేత్రంగా టీటీడీ

-టీటీడీ , అనుబంధ ఆలయాలు , సత్రాలలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు
-అత్యుత్తమ ఇంధన సామర్థ్యం కలిగిన దేవస్థానం గా టీటీడీని తీర్చిదిద్దుతాం — టీటీడీ ఈఓ, కే జవహర్ రెడ్డి
-దీనివల్ల భక్తులకు మరింత మెరుగైన ,నాణ్యమైన సేవలు
-బీఈఈ స్టార్ రేటెడ్ ఇంధన సామర్ధ్య ఉపకరణాలు, పునరుత్పాదక ఇంధనం పై టీటీడీ ప్రత్యేక దృష్టి
-విద్యుత్ బిల్లులలో 10 శాతం ఆదాకు చర్యలు
-తిరుమల లో భవనాలు, తిరుపతి లోని కళాశాలలు , పాఠశాలలో రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటుకు ప్రణాళిక
-ఇంధన సామర్ధ్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత — ఇంధన శాఖ కార్యదర్శి , శ్రీకాంత్ నాగులాపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరిన తిరుమలను పర్యావరణ హిత, ఇంధన సామర్థ్య యాత్రా స్థలంగా తీర్చిదిద్దనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా , పర్యావరణ హిత ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రవేశపెట్టేందుకు టీటీడీ ముందుకొచ్చింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ (బీఈఈ) , ఆంధ్ర ప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ సహకారంతో ఈ ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను టీటీడీ అమలు చేయనుంది. దీని వల్ల టీటీడీ ప్రస్తుతం విద్యుత్ బిల్లుల పై చేస్తున్న వ్యయంలో సుమారు 10 శాతం వరకు ఆదా అయ్యే అవకాశముంది .
జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలు-2021 సందర్భంగా శుక్రవారం నాడు నిర్వహించిన వెబినార్ లో టీటీడీ కార్య నిర్వహక అధికారి కే జవహర్ రెడ్డి , ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మరియు ఏపీఎస్ఈసిఎం అధికారులతో ఆయన మాట్లాడారు. భక్తులకు అత్యుత్తమ సేవలందించేందుకు టీటీడీ నిరంతరం కృషి చేస్తోందని ఇంధన శాఖ నిర్వహించిన వెబినార్లో టీటీడీ ఈవో కె.జవహర్ రెడ్డి చెప్పారు. వీటితో పాటు పర్యావరణ హిత ఇంధన సామర్థ్య కార్యక్రమాలు, నీటి నిర్వహణ కూడా కీలకమని.. ఈ విషయంలో టీటీడీని ఇతర ఆలయాలతో పాటు ప్రపంచానికే ఆదర్శంగా నిలపాలని యోచిస్తున్నట్లు వివరించారు. టీటీడీ ఆలయాలను ఇంధన సామర్థ్యానికి అంతర్జాతీయ గమ్యస్థానాలుగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
టీటీడీ దేవస్థానానికి 24x 7 నిరంతర, నాణ్యమైన, విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్న ఇంధన శాఖ /విద్యుత్ సంస్థల అధికారులను ఆయన అభినందించారు . భక్తులకు నాణ్యమైన , మెరుగైన సేవలు అందించేందుకు నిరంతర విద్యుత్ సరఫరా దోహదకారి అవుతుందన్నారు. పర్యావరణ హిత , ఇంధన సామర్ధ్య ప్రమాణాలకు అనుగుణంగా టీటీడీలో వివిధ కార్యక్రమాల అమలుచేయాలని భావిస్తున్నట్లు ఈఓ తెలిపారు. దీనిలో భాగంగా బీఈఈ స్టార్ రేటెడ్ ఉపకరణాలు వినియోగంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను తగినంత స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. టీటీడీ చేపట్టే ఈ ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు ఇతరులకు కూడా ఆదర్శంగా ఉండాలని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రసిద్ధ దేవాలయాలకు టీటీడీని ఒక నమూనాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇక టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలు/ కళాశాలల్లో మిద్దెలపై 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు కేంద్రాలను న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (NREDCAP) మరియు జాతీయ స్థాయి ఏజెన్సీల సహకారం తో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.ఇంధన సామర్ధ్య కార్యక్రమాలలో భాగంగా తిరుమల, తిరుపతి లో ఎలక్ట్రిక్ రవాణా సదుపాయాలను కూడా ప్రోత్సహించాలని టీటీడీ యోచిస్తోంది. టీటీడీ ఏటా 68 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తోంది. ఇందులో 30 శాతం సౌర, పవన విద్యుత్తు కాగా.. 70 శాతం (435 లక్షల యూనిట్లు) కరెంటును ఏపీఎస్పీడీసీఎల్ సరఫరా చేస్తోంది.
టీటీడీ విద్యుత్ బిల్లుల పై ఏటా సుమారు రూ 40 కోట్ల వరకు వ్యయం చేస్తోంది. ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా విద్యుత్ బిల్లులతో కనీసం 10 శాతం ఆదా చేయాలని భావిస్తుంది. అనగా రూ 4 నుంచి రూ 5 కోట్లు దశల వారీగా ఆదా చేయాలని టీటీడీ యోచిస్తోంది.
దీనిలో భాగంగా పాత పంప్ సెట్ల స్థానంలో ఇంధన సామర్ధ్య పంపుసెట్లు , 5000 సాధారణ ఫ్యాన్ల(75 వాట్లు ) స్థానంలో సూపర్ ఎఫిషియంట్ బీఎల్డీసి (బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంటు) ఫాన్స్(35 వాట్లు ) వంటి ఇంధన సామర్ధ్య ఉపకరణాలను అమర్చనున్నారు. సదరు ఫ్యాన్ల వల్ల విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు అవకాశముంది.ఈ ఇంధన సామర్ధ్య ఫ్యాన్లు అమర్చేందుకు సుమారు రూ 1. 35 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. వీటి వల్ల ఏడాదికి రూ 62 లక్షల విలువైన 0. 88 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఆదా అయ్యే అవకాశముంది . తద్వారా ఫ్యాన్ల పై పెట్టిన పెట్టుబడి రెండేళ్లలోనే రికవరీ అయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన, నమ్మకమైన చౌక విద్యుత్ కొనసాగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. అదే సమయంలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంధన సామర్ధ్య సాంకేతికతను పెంపొందించుకోవచ్చునన్నారు . తద్వారా ఇది ఇంధనం పై చేసే ఆర్థిక భారాన్ని కొంత మేర తగ్గించడం తో పాటు, విద్యుత్ రంగ బలోపేతానికి కూడా దోహద పడుతుందన్నారు. రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాల్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తి , ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరించాల్సి ఉందన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *