-శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుందరయ్య నగర్ లోని మరకత వాసవి అమ్మవారి దేవస్థానంలో శ్రీ గోదా రంగనాథ కళ్యాణం మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. పుష్పమాలలతో విశేషంగా అలంకరించిన శ్రీ గోదాదేవి శ్రీ కృష్ణ స్వామి వారికి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం అర్చకులు శ్రీ గోదాదేవి రచించిన 10 పాశురాలను పఠిస్తూ, వారణ మాయిరం క్రతువు నిర్వహించారు. చివరగా నివేదన, మంగళ హారతితో కళ్యాణ వేడుక ముగిసింది. విష్ణు సహస్ర పారాయణ మండలి కన్వీనర్ ఎం.శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజ కార్యక్రమాలలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి సహా పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం గోదాదేవి ఆవిర్భావం, గోదా కళ్యాణం ప్రాశస్త్యం గురించి అర్చకులు భక్తులకు వివరించారు. ధనుర్మాసానికి వీడ్కోలు, మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ గోదా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో APSFL చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, వైసీపీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు, నాయకులు హజరత్తయ్య గుప్తా, కొల్లూరు రామకృష్ణ, దేవస్థానం కమిటీ గౌరవ అధ్యక్షులు పి.వి.రామారావు, అధ్యక్షులు గార్లపాటి సుదర్శన్ రావు, సెక్రటరీ ముప్పిడి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.