అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రైవేట్ పాల డైరీల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే జగనన్న పాల వెల్లువ పధకం ప్రధాన ఉద్దేశ్యమని, కావున పాడి రైతులందరూ జగనన్న పాల వెల్లువ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజ్ఞప్తి చేశారు. ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ప్రగతిపై అధికారులు, ప్రమోటర్లు, పాడి రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ పాడి రైతులు జగనన్న పాల వెల్లువ పాల కేంద్రానికి అందించిన పాలకు ప్రైవేట్ పాల డైరీలు అందించే రేటు కన్నా లీటరుకు 5 నుండి 15 రూపాయల వరకు అదనంగా లబ్ది చేకూరుతుందన్నారు. దీనితో పాడి రైతులకు నెలకు 3 నుండి 5 వేల రూపాయల వరకు అదనపు ఆదాయం కలుగుతున్నదన్నారు. అంతేకాక పాడి పశువులకు పోషకాలతో కూడిన దాణా, రాయితీలు పాడి పశువులు కొనుగోలుకు రుణాలను అమూల్ సంస్థ అందిస్తుందని, కేంద్రానికి పాలు అందించిన 10 రోజులకు ఒకసారి చెల్లింపులు జరుపుతారన్నారు. ఈ ప్రయోజనాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకునేలా ప్రమోటర్లు, సిబ్బంది అవగాహన కలిగించాలన్నారు. అగిరిపల్లి మండలంలో ప్రస్తుతం పాల సేకరణ ఆశాజనకంగా ఉందని, అయినప్పటికీ పాల సేకరణను మరింత పెంచాలని కలెక్టర్ చెప్పారు. గ్రామాలలోని పాడి రైతులందరి వద్దకి వెళ్లి జగనన్న పాల వెల్లువ కార్యక్రమం అందిస్తున్న ప్రయోజనాలను తెలియజేయాలని ప్రమోటర్లను, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సందర్శించారు. గ్రామ సచివాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్ధిదారుల జాబితాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని, అదేవిధంగా అనర్హుల జాబితాలను కూడా నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భరత్ రెడ్డి, ఎంపిడిఓ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags agiripalli
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …