-ప్రపంచ చెస్ విజేత కోనేరు హంపికి శాప్ ఘనస్వాగతం
-వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఉమెన్ ఛాంపియన్‌గా కోనేరు
-హంపిని కలిసి అభినందించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు
-రాష్ట్ర క్రీడాభివృద్ధికి సూచనలు, సలహాలివ్వాలని శాప్ ఛైర్మన్ ఆకాంక్ష
-త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తానన్న హంపి
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ మహిళా చెస్ విజేత, తెలుగుతేజం శ్రీ కోనేరు హంపి గారిని మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలోని వారి నివాసంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు గారు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గత డిసెంబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ ఉమెన్ చెస్ ఛాంపియన్‌షిప్-2024లో కోనేరు హంపి గారు ప్రపంచ విజేతగా నిలిచిన విషయం విధితమే. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ గారు ఆమెను కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు. ప్రపంచ మహిళా చెస్ విజేతగా నిలిచి తెలుగుజాతి కీర్తిప్రతిష్టతలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి యువతకు స్ఫూర్తినివ్వాలని కోరుతూ శాప్ తరుపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవినాయుడు గారు మాట్లాడుతూ హంపి గారి విజయం ఆమె పట్టుదల, అంకితభావం, సంకల్పానికి నిదర్శనమని, ముఖ్యంగా యావత్ తెలుగుజాతికి గర్వకారణమని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ పాలసీలను శాప్ ఛైర్మన్ గారు ఆమెకు వివరించారు. ఏపీ క్రీడాభివృద్ధికి మీ సూచనలు, సలహాలు అందజేయాలని శాప్ ఛైర్మన్ గారు ఆకాంక్షించారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గారిని కలుస్తానని, ఏపీ క్రీడాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమానికి ముందు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు.
Prajavartha Online Telugu News