Breaking News

నిర్దేశించిన లక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు: జిల్లా కలెక్టర్ జె. నివాస్ హెచ్చరిక

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో అధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాదించాల్సిందేనని, లక్ష్యసాధనలో వెనుకబడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. స్థానిక త్రిబుల్ ఐటీ ఆడిటోరియంలో బుధవారం రెవిన్యూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై నూజివీడు డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ నవరత్నాలు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని వాటిని అర్హులైన పేదలందరికీ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయవలసి బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేసేందుకు ప్రతీ నెలా డివిజన్ స్థాయిలో మండల స్థాయి అధికారులతో సమీక్షించడం జరుగుతుందన్నారు. సమీక్షలో పధకాల అమలులో ప్రగతి సాధించే అధికారులను అభినందిచడంతోపాటు, వెనుకబడి ఉన్నఅధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముందుగా రెవిన్యూ కార్యక్రమాలపై సమీక్షిస్తూ జగనన్న భూరక్ష, భూ సర్వే పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలో పారదర్శకతతో పనిచేయాలన్నారు. నిర్ణీత సమయంలోనే పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేయాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై లబ్దిదారులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి పధకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా అందిన ధరఖాస్తులలో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు జరిగేలా దరఖాస్తు పరిష్కార విధానం ఉండాలని, అర్హత లేని దరఖాస్తులను అందుకు గల కారణాలను దరఖాస్తుదారుకు తెలియజేస్తూ నిర్దేశించిన సమయంలోగా తిప్పి పంపాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో కూలీలకు తప్పనిసరిగా 100 రోజులు కల్పించాల్సిందేనన్నారు. అందుకు అవసరమైన పనులను మండలంలో గుర్తించాలన్నారు. కూలీలకు వేతనాలను నిర్దేశించిన సమయానికే వారి ఖాతాలలో జమ అయ్యేలా చూడాలన్నారు. పని కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికి పని కల్పించాల్సిందేనన్నారు. పేదలందరికీ ఇళ్లు పధకం కింద జిల్లాలో పెద్దఎత్తున ఇళ్ల స్థలాలను పేదలకు పంపిణీ చేయడం జరిగిందని, వాటిల్లో లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించుకునేందుకు అవసరమైన అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఉచితం ఇసుక, సబ్సిడీపై సిమెంట్, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రి సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారుల నుండి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి సంక్షేమ పధకాల అమలును మండల స్థాయి అధికారులు విస్తృతంగా తనిఖీ చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు ఆకస్మికంగా తనిఖీలు చేయాలనీ, గ్రామ/వార్డ్ సచివాలయాలలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించాలని అధికారులను కలెక్టర్ నివాస్ ఆదేశించారు.  సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవీలత, ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్, శ్రీవాసు అజయ్ కుమార్, ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి, డివిజన్లలోని తహసీల్దార్లు, ఎంపిడిఓలు, రెవిన్యూ, గృహ నిర్మాణం, ఎం ఆర్ ఈ జి ఎస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *