విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని, అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును హనుమాన్ జంక్షన్ జర్నలిస్టులు కోరారు. బుధవారం అత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ముప్పవరపు వెంకయ్య నాయుడుని కలిసి ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. వినతి పత్రంలో హనుమాన్ జంక్షన్ బైపాస్ నిర్మాణం వలన హనుమాన్ జంక్షన్ లో ట్రాఫిక్ రద్దీ తగ్గినా హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడ వెళ్లేందుకు నేరుగా మార్గం కల్పించకపోవడంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. స్థానిక ఇబ్బందులతో పాటు బాపులపాడు మండలంలోని వేలేరు, రేమల్లె, సింగన్నగూడెం, మల్లవల్లి గ్రామాలకు వెళ్లే రహదారి సౌకర్యం ఫ్లై ఓవర్ నిర్మించకపోవడంతో నిలిచిపోయింది. ఈ విషయాలను మరియు హనుమాన్ జంక్షన్ అభివృద్ధిని పరిగణలోకి తీసుకొని ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని, జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్, హనుమాన్ జంక్షన్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చలమలశెట్టి శ్యామ్, ఉపాధ్యక్షుడు కూరపాటి శ్రీధర్, కోశాధికారి పల్లపు అంకమ్మ బాబు, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News