-ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
-ప్రత్యేక అతిధులుగా హాజరైన పీఐబీ డిజి (సౌత్ రీజియన్) ఎస్. వెంకటేశ్వర్లు, అదనపు డిజి రవి రామకృష్ణ
కడప, నేటి పత్రిక ప్రజావార్త :
పత్రికా సమాచార కార్యాలయం విజయవాడ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక APTDC హరిత టూరిజం హోటల్ లో వార్తాలాప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ సమాజంలో నాల్గవ స్తంభంగా గుర్తింపు పొందుతున్న.. జర్నలిస్టుల సేవలు అభినందనీయమని అన్నారు. “వార్తాలాప్” కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు, అమలు, జర్నలిజం-ప్రాముఖ్యత.. మొదలైన అంశాలపై.. జిల్లాలోని పట్టణ, గ్రామీణ జర్నలిస్టులకు అవగాహన కల్పించడం అద్భుతమైన ప్రక్రియ అని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, వాటిని జనంలోకి తీసుకుపోవడంలో మీడియా కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు. సమాజంలో జరిగే ఘటనలను బాహ్య ప్రపంచానికి తెలియజేయటానికి ఆహర్నిశలు పాటుపడే జర్నలిస్టుల శ్రమ, కృషి అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా వరదలు, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో.. ప్రాణాలను పణంగా పెట్టి జర్నలిస్టులు వృత్తిధర్మాన్ని నిర్వర్తించారని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాయన్నారు.
ఈ సమావేశానికి ప్రత్యేక అతిధిగా హాజరైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ (సౌత్ రీజియన్) వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
జర్నలిస్టులు ఎప్పుడూ… సామాజిక స్పృహతో వార్తా కథనాలను ప్రచురించాలని సూచించారు. జర్నలిజం వృత్తిలో నైపుణ్యతను, నైతిక విలువలను పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో గ్రామీణ స్థాయి జర్నలిస్టుల సంక్షేమానికి… కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పాటుపడుతోందన్నారు. జర్నలిజం వృత్తిలో నైపుణ్యతను, నైతిక విలువలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలపై జర్నలిస్టులు అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల సంక్షేమానికి.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సమాచార పౌరసంబంధాల శాఖలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అదనపు డిజి రవి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలలో ఎక్కువ శాతం లబ్దిదారులు గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటారని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, నిర్వహణ సాధ్యాసాధ్యాలు, లబ్ధిదారుల ఫీడ్ బ్యాక్, లబ్ది దారుల విజయ గాథలు.. మొదలైన అంశాలపై గ్రామీణ, పట్టణ స్థాయి జర్నలిస్టులు పూర్తి స్థాయి అవగాహనతో.. సమాచారాన్ని సేకరించి వార్తలు ప్రచురించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో ప్రజలకు చేరవేస్తూ.. సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే జర్నలిస్టులకు సరళంగా అర్ధమయ్యే విధంగా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్న పీఐబీ వెబ్ సైట్ ని జర్నలిస్టులు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ సంచాలకులు శివ హరినాయక్ ఎం., మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారులు హెన్రీ రాజ్, శ్రీరామ మూర్తి, సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు పి.వేణుగోపాల్ రెడ్డి, ఎపి డబ్ల్యూజేయు ప్రెసిడెంట్ రామసుబ్బారెడ్డి, జర్నలిస్టులు పాల్గొన్నారు.