-నగరంలో పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు…
-రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యావసర సరుకులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా సరుకులను నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు నాయకత్వంలో లీగల్ మెట్రోలజీ, పౌరసరఫరాలశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అధికారులు మోడరన్ సూపర్ మార్కెట్, ఉషోదయ, రిలయన్స్ మార్ట్, మెట్రో మార్ట్ ,ఫ్లిప్ కార్డ్ సూపర్ మార్కెట్ వంటి పలు నిత్యావసర సరుకుల దుకాణాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి ధరలను పరిశీలించారు. ఎంఆర్పి ధరలకే సరుకులను కొనుగోలు చేశారా, అని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా వంటనూనెలను ఎంఆర్పి ధరలకే విక్రయించాలని దుకాణాలు నిర్వాహకులను ఆదేశించారు. కందిపప్పు, మినపప్పు, నూనెలను అక్రమంగా నిల్వచెసి బహిరంగ మార్కెట్లో కృతిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయాలు జరిపే దుకాణాల పై కేసులు నమోదు చేయటం జరుగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ టి.కనకరాజు హెచ్చరించారు.
Prajavartha Online Telugu News