-14 సేవలు ఆన్ లైన్ ద్వారా ప్రారంభం
-అధికారిక వెబ్ సైట్ ద్వారా లాంఛనంగా ప్రారంభించిన పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్
-పారిశ్రామికవేత్తలకు స్నేహపూర్వకం…ప్రజలకు పారదర్శకం : ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు, పారిశ్రామికవేత్తలకు మరింత జవాబుదారీగా నిలిచి, సేవలను చేరువ చేసే కార్యక్రమానికి ఏపీఐఐసీ శ్రీకారం చుట్టింది. దరఖాస్తు నుంచి మొదలై అనుమతులు, భూ కేటాయింపులు సహా అన్నింటినీ ఆన్ లైన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు అందించేందుకు సిద్ధమైంది. 14 సేవలు అందించేలా ఏపీఐఐసీ తీర్చిదిద్దిన ఈ వెబ్ పోర్టల్ ను మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ..సమయభావాలకు ఆస్కారం లేని విధంగా గడువు నిర్దేశించుకుంటూ పని చేసే సాంకేతిక వ్యవస్థని అందుబాటులోకి తీసుకువచ్చిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందాన్ని ఆయన అభినందించారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖకు చెందిన జనరల్ మేనేజర్లు, ఏపీఐఐసీకి చెందిన జోనల్ మేనేజర్లు కలిసి పని చేసి మరిన్ని మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. www.apindustries.gov.in కు ఏపీఐఐసీ సేవలు అనుసంధానమవడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు ఇవాళ్టితో ఈ సేవలన్నీ అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. జిల్లాల విభజన నేపథ్యంలో పరిశ్రమల శాఖపై మరింత ఎక్కువ బాధ్యత ఉన్నట్లు స్పెషల్ సీఎస్ పేర్కొన్నారు.
14 సేవలకూ ఒకటే…. కామన్ అప్లికేషన్ ఫామ్ (సీఏఎఫ్ ): ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది
ప్రతి పారిశ్రామికవేత్త పరిశ్రమల శాఖ వెబ్ సైట్ తో అనుసంధానమైన సింగిల్ విండో పోర్టల్ ద్వారా ఏపీఐఐసీ సేవలు పొందవచ్చని ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది వెల్లడించారు. 14 సేవలలో ఏ సేవ పొందాలనుకున్న ఆన్ లైన్ లో ఒకే అప్లికేషన్ ఫామ్ నింపి పంపితే చాలునని ఆయన స్పష్టం చేశారు. వెబ్ సైట్ లో ఎంటర్ ప్రినర్ లాగిన్ లోకి వచ్చి కంపెనీ ఐడీ, ఫైల్ నంబర్ వంటి తప్పనిసరి వివరాలు జతపరిస్తే చాలునన్నారు. 5 ప్రాథమిక సిద్ధాంతాలతో తీర్చిదిద్దిన పోర్టల్ ద్వారా 14 సేవలలో కొన్ని 15 రోజులు, మరికొన్ని నెల రోజులు, ఇంకొన్ని 45 రోజుల్లో ఫైల్ ప్రాసెస్ కి కంప్యూటర్ ద్వారా గడువు నిర్దేశించినట్లు ఎండీ వెల్లడించారు. యూజర్ నేమ్ , పాస్ వర్డ్ తో పాటు క్యాప్చ లెటర్స్ ని పొందుపరచి సేవలను పొందవచ్చన్నారు. పరిశ్రమల పేర్లలో మార్పులు మాత్రమే అత్యల్పంగా 15 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేటాయింపుల బదిలీ, పరిశ్రమను మరొక నియోజకవర్గానికి మార్చడం, 5 ఎకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ ల విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాటుకు సంబంధించిన ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ప్రాజెక్టుకు అమలుకు నిర్దేశించిన గడువు పెంపు, ముందస్తు చెల్లింపులకు అవసరమైన గడువు పెంపు వంటి సేవలకు మాత్రం కనీసం 45 రోజులంలో పూర్తి చేసే విధంగా గడువును కంప్యూటర్లో ముందే పొందుపరచామన్నారు. పారిశ్రామికవేత్త పూర్తి వివరాలు అప్ లోడ్ చేసి సబ్ మిట్ చేశాక ఆ విన్నపాన్ని బట్టి, పరిశ్రమ ఐడీ, ఫైల్ నంబర్ ని బట్టి ఆ దరఖాస్తు తదనుగుణంగా సంబంధిత జిల్లా జోనల్ మేనేజర్ కు చేరుతుందన్నారు. పారదర్శకత, పరిపాలనలో వేగాన్ని పెంచాలన్నదే ఏపీఐఐసీ ఆన్ లైన్ సేవల లక్ష్యమన్నారు. చిన్న పనులకే ఎక్కువ సమయం వృథా అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నియంత్రణకోసం ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కలిసి పని చేస్తాయని ఈ సందర్భంగా ఎండీ స్పష్టం చేశారు. మంచి ఆలోచన, దానికి తగిన టెక్నాలజీ సహకారం, ఆచరణలో పెట్టే ఉద్యోగులు అందుబాటులో ఉండడం వల్ల త్వరలోనే అనుకున్న లక్ష్యం చేరతామన్నారు. తద్వారా మిగిలే సమయాన్ని పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ కీలక ప్రాజెక్టు, పనుల ప్రమోషన్ పై పెట్టే దిశగా ముందుకు సాగుతామని ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది చెప్పారు.
ఆన్ లైన్ సేవలు…ఎన్నో లాభాలు
పరిశ్రమల పేర్లను మార్చుకోవడం, కేటాయింపులలో మార్పు, కేటాయింపుల బదిలీ, పున: కేటాయింపులు, కేటాయింపులను వెనక్కి తీసుకోవడం, లైన్ ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, 5 ఎకరాలలోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ , 5 ఎకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ ల విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాటుకు సంబంధించిన ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ప్రాజెక్టుకు అమలుకు నిర్దేశించిన గడువు పెంపు, ముందస్తు చెల్లింపులకు అవసరమైన గడువు పెంపు ఇలా 14 సేవలు పారిశ్రామికవేత్తలు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా ఏ విధమైన సేవ పొందడానికైనా ఒకే ఒక్క దరఖాస్తు ఆన్ లైన్ ద్వారా పంపితే చాలునని ఏపీఐఐసీ వెల్లడించింది.
ఏపీఐఐసీ ఆన్ లైన్ సేవల ద్వారా పారిశ్రామికవేత్తల సమయం వృథా ఉండదు. దరఖాస్తు స్టేటస్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఫైల్ ఎక్కడ ఉందో నిర్ధారించుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఆన్ లైన్ లోనే దరఖాస్తు నింపి, ఏపీఐఐసీకి పంపవచ్చు. ఏ సేవనైనా సగటున 15 నుంచి 20 రోజులలో పూర్తి చేసుకునే అవకాశం. సింగిల్ విండో పోర్టల్ ద్వారా 14 సేవలను ఒకే అప్లికేషన్ తో పొందవచ్చు. ఇంతే కాకుండా ఆన్ లైన్ లోనే అనుమతులు కూడా పొందవచ్చు. దూర, భారాలు, వ్యయ ప్రయాసాలకు ఆస్కారం లేదు. వచ్చిన వారందరినీ కలిసి వివరించే ఒత్తిడి ఏపీఐఐసీకి ఉండదు. చాలా సులభంగా అర్థం చేసుకుని ఒక్కో అడుగుతో పని పూర్తి చేయవచ్చు. దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫీజుల వివరాలు, గడువులను తెలుసుకోవచ్చు.
ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్, వివిధ విభాగాలకు చెందిన సీజీఎంలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల్లోని జీఎంలు, జెడ్ ఎంలు పాల్గొన్నారు.