-ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా ఉండేలా ప్రెండ్లీ పోలీస్ వ్యవస్థ
-పోలీస్ శాఖలో జవాబుదారీతనం,పారదర్శకత,సత్వర స్పందన పెరిగింది
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ మంత్రిగా తానేటి వనిత సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు కుటుంబ సభ్యులతో విచ్చేసిన ఆమెకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా పూజలు నిర్వహించిన తదుపరి రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. జైళ్లలో నేరస్తులను కలిసేందుకు వచ్చే వారికి సత్వరమే అనుమతి ఇచ్చే పైల్ పై ఆమె తొలి సంతకం చేశారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ మంత్రి గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని, అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నేడు ఎంతో సంతోషంగా ఉందని, మరిచిపోలేని దినమని, ముఖ్యమంత్రి తనపై ఎంతో నమ్మకంతో కీలకమైన శాఖను తనకు అప్పగించారని, వారు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ముకానీయకుండా హోమ్ శాఖ ప్రతిష్ట ఇనుమడించేలా కృషి చేస్తానని ఆమె అన్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినతదుపరి రాష్ట్రంలో ఎన్నో పరిపాలన సంస్కరణలను అమలు చేయడం జరిగిందని, పరిపాలన వికేంద్రీకరణ చేసి ప్రజలవద్దకే పరిపాలనను తీసుకువెళ్లారన్నారు. అదే విధంగా పోలీస్ శాఖ ద్వారా న్యాయం, చట్టం ప్రజలందరికీ ఎటు వంటి వివక్షత లేకుండా అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలతో పోలీసు వ్యవస్థ ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ప్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు పర్చే విధంగా గత మూడేళ్లలో ముఖ్యమంత్రి చేసిన కృషికి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కరోనా సమయంలో పోలీసులు ప్రంట్ లైన్లో ఉండి ప్రజలకు ఎంతగానో సేవలందించారన్నారు. పోలీసులు అందజేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు కూడా వచ్చాయన్నారు. పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందజేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో దేశంలో రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. అందుకు దిశ యాప్ ఒక ఉదాహరణ అన్నారు. రాష్ట్రంలోని మహిళకు భద్రత కల్పించేందుకు దిశ చట్టాన్ని ప్రతిపాదించి కేంద్రం ఆమోదానికి పంపడం జరిగిందని, ఆ చట్టం సత్వరమే కేంద్ర ఆమోదం పొందేలా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్నారు. మహిళా భద్రతకై రాష్ట్రంలో వినియోగిస్తున్న దిశ యాప్ ద్వారా ఇప్పటి వరకూ 900 మందిని రక్షించడం జరిగిందని, ఇప్పటి వరకూ ఒక కోటి 13 లక్షల మంది తమ స్మార్టు ఫోన్లలో ఈ దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. పోలీస్ శాఖలో జవాబుదారితనం, పారదర్శకత, సత్వర స్పందన, ప్రెండ్లీ పోలీస్ విధానం పెరిగే విధంగా ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో శాంతి, భద్రతల విషయంలో అలజడి సృష్టించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తుంటాయని, అయితే అటు వంటి శక్తుల నియంత్రణలో ప్రభుత్వం, అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయని ఆమె అన్నారు.
హోమ్ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్, జైళ్ల శాఖ డి.జి. హసన్ రజే, డిఐ.జి.లు సి.ఎం.త్రివిక్రమవర్మ, రాజశేఖర్, గుంటూరు ఎస్.పి. తదితరులతో పాటు పోలీస్ శాఖకు చెందిన పలువురు అధికారులు, అనధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ మంత్రి తానేటి వనితకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందలు తెలిపారు.