-శాసన సభ్యులను సమన్వయ పరుస్తూ సభ సజావుగా సాగేలా కృషిచేస్తా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ చీఫ్ విప్ గా ముదునూరి ప్రసాద రాజు గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతిలోని ఆంద్రప్రదేశ్ శాసన సభ భవనంలో కేటాయించిన ఛాంబరులో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తదుపరి ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలువురు అధికారులు, అనధికారులు ఆయన పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శాసన సభ సజావుగా జరిగేలా, విప్ లు మరియు సభ్యులు అందరినీ సమన్వయ పరుస్తూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా, ప్రజాసమస్యలపై శాసన సభలో సమగ్రంగా చర్చ జరిగేలా మరియు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని ఆయన తెలిపారు. అన్ని వర్గాలు, ప్రాంతాల వారికి క్యాబినెట్ లో సముచిత స్థానం కల్పిస్తూ సుస్థిర మైన పాలనను ప్రజలు అందజేస్తున్న ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రజా రంజకంగా ముఖ్యమంత్రి అందజేస్తున్న పాలనను ప్రజ లందరూ మెచ్చుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్టారన్నారు.